తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ట్రాఫిక్‌జామ్‌

Andhra Pradesh: Landslides Bring Traffic to Halt on Tirumala Ghat Road - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలకి వెళ్లే రెండవ ఘాట్ రోడ్డు ధ్వంసం అయింది. గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాలకి భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. బుధవారం ఉదయం 5.40 గంటల ప్రాంతంలో భారీ సైజు టన్నుల‌ కొద్ది బరువున్న రాయి పైనుంచి పడటంతో ఘాట్ రోడ్డు నాలుగు ప్రాంతాలలో భారీగా కోతకు గురయ్యింది. దీంతో అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేశారు. మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు రెండవ ఘాట్‌ రోడ్‌లో పూర్తిగా వాహనాలు నిలిపివేయడంతో అలిపిరిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. మొదటి ఘాట్‌ రోడ్డు నుంచి విడతల వారీగా తిరుమలకు వెళ్లడానికి వాహనాలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ సీవీఎస్వో గోపీనాధ్ జెట్టి తెలిపారు. 

ఆ ప్రాంతాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్‌
రెండవ ఘాట్ రోడ్డును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. ఉదయం 5 - 45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్ చెప్పారు.

ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతికి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్  అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయంపై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్‌లోలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top