న్యాయ రాజధానిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ 

Andhra Pradesh Human Rights Commission in the Judicial Capital - Sakshi

కార్యాలయాన్ని ప్రారంభించిన చైర్మన్‌ జస్టిస్‌ సీతారామమూర్తి

ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదుల స్వీకరణ

అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచన  

కర్నూలు (సెంట్రల్‌): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) కార్యాలయం బుధవారం కర్నూలులో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర హెచ్‌ఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి తన చాంబరులో ఆశీనులవ్వగా.. జ్యుడిషియల్‌ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యుడు జి.శ్రీనివాసరావు, జిల్లా జడ్జి వి.రాధాకృష్ణ కృపాసాగర్, కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, జేసీలు ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, ఎన్‌.మౌర్య, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జ్యుడిషియల్‌ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యుడు జి.శ్రీనివాసరావుల చాంబర్లను కూడా ప్రారంభించారు.  

త్వరలోనే కర్నూలుకు హైకోర్టు..  
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారని జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి కరీం అన్నారు. మూడు రాజధానులకు ఉన్న అన్ని ఆటంకాలను ఆయన అధిగమిస్తారని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకున్న అడ్డంకులు కూడా త్వరలోనే తొలగిపోతాయన్నారు. దాదాపు 50కి పైగా జ్యూడీషియరీ కమిషన్లు న్యాయ రాజధానికి తరలివస్తాయని చెప్పారు.  

ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులు.. 
కార్యక్రమం అనంతరం జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి మీడియాతో మాట్లాడారు. మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయం ఇప్పటి నుంచి కర్నూలులో పనిచేస్తుందని ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన బాగుందన్నారు. ఈ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులను ఆయన అభినందించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే.. ప్రతి ఒక్కరూ కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందాలని సూచించారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. వారంలో ఒకరోజు నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో బి.పుల్లయ్య, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, కర్నూలు ఆర్‌డీఓ హరిప్రసాద్, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆదిశేషునాయుడు తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top