‘వెబ్‌సైట్‌లో ఎందుకు ఉంచట్లేదు’?

Andhra Pradesh High Court question to government on Orders of Government Departments - Sakshi

జీవోలపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖలు జారీ చేసే ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో ఎందుకు ఉంచట్లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ జీఎంఎన్‌ఎస్‌ దేవి(నెల్లూరు), కె.శ్రీనివాసరావు(గుంటూరు), ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు(అనంతపురం) వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.

వీటిని సీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జి.శ్రీకాంత్, ఇంద్రనీల్, బాలాజీ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం ఇకపై జీవోలన్నింటినీ ఏపీ ఈ–గెజిట్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఇటీవల చెప్పిందని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఓ వెబ్‌సైట్‌ బదులు మరో వెబ్‌సైట్‌లో ఉంచుతామని ప్రభుత్వం చెబుతోందిగా, దానివల్ల నష్టమేంటని ప్రశ్నించింది. అయితే జీవోలను రహస్యం, అత్యంత రహస్యం, గోప్యం అంటూ వర్గీకరించిందని.. వాటికి సంబంధించిన జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచబోమని ప్రభుత్వం చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.  

గత విధానాన్నే అనుసరిస్తున్నాం.. 
ఏపీ సచివాలయ మాన్యువల్‌ రూల్స్‌తో పాటు ఏపీ బిజినెస్‌ రూల్స్‌కు.. ఆ మూడింటికీ ఉన్న నిర్వచనాలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ ధర్మాసనానికి వివరించారు. ఆ రూల్స్‌కు అనుగుణంగా వర్గీకరణ చేశామన్నారు. ఇలాంటి జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడమన్నది ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎప్పుడో రూపొందించిన నిబంధనలను ఇప్పటికీ అమలు చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించింది. ఆ నిబంధనలను సవరించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. అనంతరం కౌంటర్‌ దాఖలుకు గడువిస్తూ.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top