పీపీఏ ప్రకారమే చెల్లింపులు

Andhra Pradesh High Court order for DISCOMs Payments as per PPA - Sakshi

బకాయిలను ఆరు వారాల్లో చెల్లించండి

డిస్కంలకు హైకోర్టు ఆదేశం

సింగిల్‌జడ్జి ఉత్తర్వులను రద్దుచేసిన ధర్మాసనం

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) పేర్కొన్న ధరల ప్రకారమే పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తిదారులకు చెల్లింపులు చేయాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలను (డిస్కం) ఆదేశించింది. ఇప్పటికీ చెల్లించాల్సి ఉన్న బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. పవన విద్యుత్‌కు యూనిట్‌ రూ.2.43, సౌర విద్యుత్‌కు యూనిట్‌ రూ.2.44 చొప్పున చెల్లించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దుచేసింది. అలాగే, పీపీఏలను పునః సమీక్షించే అధికారం ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి ఉందని, అభ్యంతరాలన్నీ ఈఆర్‌సీ ముందు ప్రస్తావించుకోవాలని పవన, సౌర విద్యుత్‌ సంస్థలకు స్పష్టంచేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం రద్దుచేసింది.

ఈఆర్‌సీ ముందున్న ఓపీ 17, ఓపీ 27కు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ అన్నింటినీ కొట్టేసింది. ఇక పవన, సౌర విద్యుత్‌ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌లో కోత విధిస్తూ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాలుచేస్తూ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తిదారులకు యూనిట్‌కు రూ.2.43, రూ.2.44 చొప్పున చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పవన, సౌర విద్యుత్‌ కంపెనీలు ధర్మాసనం ముందు  అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ఇటీవల వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించింది.
 
పీపీఏ నిబంధనలను మార్చలేం..
ఆర్థికపరమైన ఇబ్బందులవల్ల పవన, సౌర విద్యుత్‌ కంపెనీలకు పీపీఏల ప్రకారం చెల్లింపులు చేయలేకపోతున్నామన్న డిస్కంల వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. విద్యుత్‌ సరఫరా చేస్తున్నందుకు వినియోగదారుల నుంచి విద్యుత్‌ చార్జీలను వసూలుచేస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులని చెప్పడం సరికాదని ధర్మాసనం స్పష్టంచేసింది. పీపీఏ నిబంధనలను పార్టీలు గానీ, కోర్టుగానీ మార్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

పీపీఏలను ఏపీఈఆర్‌సీ పునః సమీక్షించేంత వరకు మధ్యంతర ఏర్పాటుకింద పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తిదారులకు యూనిట్‌కు రూ.2.43, రూ.2.44 చొప్పున చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సరికాదని, అవి చట్టానికి అనుగుణంగాలేవని ధర్మాసనం ఆక్షేపించింది. అందువల్ల సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దుచేస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అలాగే.. 25 ఏళ్ల పాటు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవరించి రేట్లను కుదించే అధికారం ఈఆర్‌సీకి లేదని ధర్మాసనం తెలిపింది.

టారిఫ్‌లో మార్పులతో పెట్టుబడులపై ప్రభావం
‘ప్రజాభిప్రాయాన్ని సేకరించి, డిస్కంల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఏపీఈఆర్‌సీ పవన విద్యుత్‌ టారిఫ్‌ను ఖరారుచేసింది. దీనికి అనుగుణంగానే రూ.30 వేల కోట్ల మేర పవన విద్యుత్‌ రంగంలో దీర్ఘకాల ప్రణాళికల ఆధారంగా పెట్టుబడులు పెట్టారు. గ్లోబల్‌ వార్మింగ్, ఉద్గారాల తగ్గింపులో పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటి దానికి సంబంధించిన టారిఫ్, నిబంధనల్లో మార్పుచేస్తే అది ప్రపంచంలోని పెట్టుబడిదారులపై పడుతుంది.

పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి వారు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్‌ ఒప్పందాలను కొనసాగించేందుకు డిస్కంలు సొంత నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. డిస్కంలు వినియోగదారుల నుంచి విద్యుత్‌ చార్జీలు వసూలుచేస్తున్నాయి. కాబట్టి డిస్కంల ఆర్థిక పరిస్థితికి మరేదైనా కారణం కావొచ్చుగానీ, పీపీఏలో నిర్ణయించిన టారిఫ్‌ కాదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top