ఆ వివరాలన్నీ మా ముందుంచండి

Andhra Pradesh High Court order to CBI On Gangireddy bail petition - Sakshi

గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌లో సీబీఐకి హైకోర్టు ఆదేశం 

విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి కింది కోర్టు ఎప్పుడు బెయిల్‌ ఇచ్చింది? దాన్ని రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడు పిటిషన్‌ వేసింది? ఆ పిటిషన్‌ను కింది కోర్టు ఎప్పుడు కొట్టేసింది? గంగిరెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు ఇచ్చిన వాంగ్మూలాలు తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఉత్తర్వులు జారీచేశారు.

గంగిరెడ్డికి కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్‌ రాయ్‌ విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది ఎ.చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. బెయిల్‌పై బయట ఉన్న గంగిరెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని చెప్పారు. వివేకా హత్య వెనుక రాజకీయ పెద్దల ప్రమేయం ఉందన్నారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం సైతం ఇచ్చారని తెలిపారు.

సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలం ఇస్తానని మొదట చెప్పిన సీఐ శంకరయ్య, గంగాధర్‌రెడ్డి, కృష్ణారెడ్డిలు గంగిరెడ్డి, అతడి అనుచరులు బెదిరించడంతో 164 వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. గంగిరెడ్డి బయట ఉంటే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ వాదనలను గంగిరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు తోసిపుచ్చారు. సీబీఐవి కేవలం ఆరోపణలు మాత్రమేనన్నారు. గంగిరెడ్డి సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు లేవన్నారు. శంరయ్య తదితరులు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరిస్తే దానికీ గంగిరెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. బెయిల్‌ రద్దుకోసం సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తివివరాలు తమముందు ఉంచాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top