సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలి?. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా?. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు పదేళ్లు పడుతుంది’’ అంటూ జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. సునీత పిటిషన్‌పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టును గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఆ సమయంలో జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని పాక్షికంగా ఆదేశాలు ఇచ్చింది. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందని.. ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను కూడా పట్టించుకోలేదని పిటిషన్ ద్వారా సునీత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వివేకా కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
‘‘ఇంకెంతకాలం దర్యాప్తు కొనసాగించాలనుకుంటున్నారు. ఈ కేసులో మళ్ళీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా?. ఇలాగైతే కేసు దర్యాప్తు పూర్తి కావడానికి మరో పదేళ్లు పడుతుంది. సిబీఐ ఈ విషయంలో తన వైఖరి తెలియజేయాలి. తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి. దీన్ని లాజికల్ ఎండ్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సీబీఐ వైఖరి ఆధారంగా ఈ కేసులో మేము నిర్ణయం తీసుకుంటాం. తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే ఎంత మేరకు కావాలి ?. తదుపరి దర్యాప్తుకు అనుమతిస్తే బెయిల్ పై దాని ప్రభావం ఎలా ఉంటుంది. అన్ని అంశాలను మేము బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. ఆ మేరకు ఆదేశాలను సవరించాల్సి ఉంటుంది’’


