డైట్, కాస్మోటిక్‌ చార్జీల పెంపు.. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సర్కారు వరం 

Andhra Pradesh Govt Gift For students of welfare hostels - Sakshi

మాటల వంటకం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్న జగన్‌ సర్కారు 

బడ్జెట్‌లో డైట్‌ చార్జీలకు రూ.755 కోట్లు.. కాస్మోటిక్‌ చార్జీలకు రూ.78 కోట్లు కేటాయింపు 

తాజా పెంపుతో డైట్‌ చార్జీలకు రూ.112 కోట్లు.. కాస్మోటిక్‌ చార్జీలకు రూ.48 కోట్లు అదనపు కేటాయింపు 

బలహీన వర్గాల సంక్షేమంపై వైఎస్సార్‌సీపీ సర్కారు చిత్తశుద్ధికి ఇది నిదర్శనం 

కానీ, డైట్‌ చార్జీలు సక్రమంగా అమలుచేయని చంద్రబాబుపై ఈనాడుకు ఎక్కడలేని ప్రేమ 

డైట్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే తరుణంలో ఈనాడు దుష్ప్రచారం 

సాక్షి, అమరావతి: బలహీన వర్గాల పిల్లల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకుంది. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠ­శా­లల్లో విద్యార్థులకు డైట్, కాస్మోటిక్‌ ఛార్జీల పెంపు విషయంలో ఎల్లో మీడియా ఎంత రాద్ధాంతం చేసి­నా తమది మాటల వంటకం కాదని.. చేతల ప్రభు­త్వ­మని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా నిరూపించారు. ఈ ఛార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం జీఓ–8, 9 ఉత్తర్వులు జారీచేశారు.  

బడ్జెట్‌లో కన్నా అధికంగా కేటాయింపు 
రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో డైట్‌ చార్జీలకు రూ.755 కోట్లు, కాస్మోటిక్‌ చార్జీలకు రూ.78 కోట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. తాజాగా.. ఈ చార్జీలను పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.160 కోట్ల అదనపు భారం పడుతుంది. వీటిలో డైట్‌ చార్జీలకు రూ.112 కోట్లు, కాస్మోటిక్‌ చార్జీలకు రూ.48 కోట్లు ప్రభుత్వం అదనంగా కేటాయిస్తోంది.

రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదివే హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల విషయంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సర్కారుకు వారిపట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో రాష్ట్రంలో 5.92 లక్షల మంది బడుగు, బలహీనవర్గాల పిల్లలకు మేలు చేకూరుతుంది. 

బాబు బకాయిలు రూ.132 కోట్ల చెల్లింపు 
నిజానికి.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో డైట్‌ చార్జీలను 2012లో పెంచారు. అప్పటి నుంచి ఆరేళ్లపాటు వాటిని పట్టించుకున్న నాధుడే లేడు. 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా, మొక్కుబడిగా 2018 జూన్‌ 5న డైట్‌ చార్జీలు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనిని 2018 జూలై 1 నుంచి అమలులోకి తె­చ్చారు.

కానీ, వాటిని కూడా సక్రమంగా అమలుచేయలేదు. 2018 జూలై నుంచి 2019 ఫిబ్రవరి వరకు కేవలం ఎనిమిది నెలల కాలానికి మాత్రమే తూతూమంత్రంగా అమలుచేసింది. పైగా డైట్‌ చార్జీ­లు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బ­ందులు పెట్టింది. దీంతో రూ.132 కోట్ల బకాయిలను సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చెల్లించింది. 

చంద్రబాబు కోసమే ఈనాడు వంకర రాతలు 
వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూల్స్, ఇతర సంక్షేమ విద్యా సంస్థల్లోని బోర్డర్ల (విద్యార్థులు)కు డైట్, కాస్మోటిక్‌ చార్జీలు పెంచేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఏర్పాటుచేసిన కమిటీ సూచనల మేరకు ప్రతిపాదనలు రూపొందించారు. వాటిని సర్కారు ఆమోదించే తరుణంలో చంద్రబాబు ప్రయోజనాల కోసం ‘మాటల వంటకం’ అంటూ ఈనాడు ఇటీవలే విషప్రచారం చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top