breaking news
Diet charges
-
పిల్లలకు ప్రత్యక్ష నరకం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని 3,878 ప్రభుత్వ వసతి గృహాలు(హాస్టల్స్), గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడుపు నిండా తిండి లేక, రాత్రిళ్లు నిద్ర లేక సతమతమవుతున్నారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల పప్పు, సాంబారుతోనే పిల్లలకు భోజనం పెడుతున్నారు. అధిక శాతం హాస్టళ్లకు ఇప్పటిదాకా దుప్పట్లు, దోమ తెరలు పంపిణీ కాలేదు. సరిపడా స్నానపు గదులు, మరుగు దొడ్లు లేక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాలికలైతే ఉదయాన్నే వాష్ రూమ్‌ల ఎదుట క్యూ కడుతున్నారు. బాలురైతే ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. సమయానికి డైట్ చార్జీలను ప్రభుత్వం ఇవ్వక పోవడంతో మెనూలో నాణ్యత పూర్తిగా లోపించింది. చాలా మంది వార్డెన్లు సరుకులు అప్పుగా తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో చెడిపోయిన, నాణ్యత లేని కూరగాయలతో వంట చేస్తున్నారు. ఫలితంగా ఆహారం కలుషితమై పిల్లలు తరచూ రోగాలబారిన పడుతున్నారు. చాలా హాస్టళ్లు భోజనాలకే పరిమితమవుతున్నాయి. వసతులు లేనందున రాత్రిళ్లు పిల్లలు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కళాశాలకు వెళ్లే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. ఉదయాన్నే వంట పూర్తి కాక చాలా మంది పస్తులుంటున్నారు. మరికొన్ని చోట్ల కేవలం తెల్లన్నం బాక్స్‌లో పెట్టుకుని వెళ్తున్నారు. మరోవైపు కాస్మొటిక్ చార్జీలు కూడా అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. చాలా హాస్టళ్లు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. సమీపంలోనే మురుగు నీటిలో పందులు తిరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లను ‘సాక్షి’ బృందం సందర్శించినప్పుడు దాదాపు అన్ని హాస్టళ్లలో ఇదే దుస్థితి కనిపించింది. అన్నీ బకాయిలే ప్రతి సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి ఒక దుప్పటి, ఒక కార్పెట్, రెండు టవళ్లు, ప్లేటు, గ్లాసు, బౌలు, ట్రంకు పెట్టె ఇవ్వాల్సి ఉండగా, అరకొరగా అందించి అయ్యిందనిపించారు. ఒక్కొక్కరికి రూ.46 చొప్పున డైట్ బిల్లు (మెస్ చార్జీలు) సైతం సకాలంలో ఇవ్వకుండా పెండింగ్ పెడుతున్నారు. దీన్ని సాకుగా తీసుకున్న హాస్టల్, గురుకులాల నిర్వాహకులు విద్యార్థులకు అందించే మెనూలో కోత పెడుతున్నారు. ప్రతి రోజు అందించాల్సిన గుడ్డు, వేరుశనగ చిక్కీ, వారానికి రెండు సార్లు చికెన్ సైతం సరిగా ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.ప్రతి నెలా ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు, బార్బర్ ఖర్చులను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ అద్దె భవనాలకు సైతం ఐదు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో హాస్టల్, గురుకులానికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు చొప్పున ఏడాదికి ముందే ఇవ్వాల్సిన కంటింజెంట్ బిల్స్ కూడా మంజూరు చేయకపోవడంతో స్టేషనరీ, నిత్యావసర వస్తువులు, హెల్త్ కిట్స్, రిపేర్లు వంటి అత్యవసరమైన వాటికి అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,878 ప్రభుత్వ వసతి గృహాలు(హాస్టల్స్), గురుకుల విద్యాలయాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 6,35,864 మంది విద్యార్థులు అవస్థలపాలవుతున్నారు. వసతుల లేమి, ఆరోగ్య సమస్యలు, నిర్వహణ వైఫల్యం, ఆర్థిక సమస్యలు విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు సైతం ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. హాస్టల్స్, గురుకులాల్లో ఉండే పేద పిల్లలకు మెరుగైన వసతులు కల్పిస్తామంటూ కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. మెనూ కచ్చితంగా అమలుకాకపోగా చాలా చోట్ల కలుషిత ఆహారం, నిల్వ ఆహారంతో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనకాపల్లి, శ్రీకాకుళం, తిరుపతి, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లోని వసతి గృహాలు, గురుకులాల్లో కలుషిత ఆహారం కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంత్రుల సొంతూళ్లలోనూ అదే దుస్థితి 230 మందికి ఆరు చిన్న గదులు.. నీటి కొరత, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, మంచాలు లేక కటిక నేలపైనే నిద్ర, అధ్వానంగా మరుగుదొడ్లు ఇదీ సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సొంత జిల్లా ప్రకాశంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితి. ఒంగోలు బాలికల వసతి గృహాల్లో ఉదయం మరుగుదొడ్ల వద్ద భారీ క్యూ కనిపిస్తోంది. దీంతో సమయానికి కళాశాలకు వెళ్లలేకపోతున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని హాస్టళ్లలో పారిశుద్ధ్య లేమి, తలుపులు లేని మరుగుదొడ్లు, విరిగిపోయిన బల్లలు, కలుషిత తాగునీరు, విద్యుత్ కోతలు, దోమల బెడద.. తదితర సమస్యల మధ్య విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అన్ని సౌకర్యాలు కల్పించామని అధికార కూటమి ప్రజాప్రతినిధులు మాత్రం ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారు. భోజనం తినలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ హాస్టళ్లలో పిల్లలు నేలపైనే నిద్రిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోని హాస్టళ్లలో మంచి నీటి సౌకర్యం సరిగా లేదు. మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదు. రాయలసీమ జిల్లాల్లోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించక పోవడంతో సమస్యలు తాండవిస్తున్నాయి. విద్యార్థులకు సరిపడా గదులు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలికల హాస్టళ్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక శాఖలకు చెందిన బీసీ సంక్షేమశాఖ, ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రులు ఉన్నా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయం. చాలా చోట్ల బాత్రూంలు శుభ్రంగా ఉంచక పోవడంతో విద్యార్థులు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. భద్రత గాలికి.. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న భావితరం భద్రతను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాల నిర్వహణలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏడాది కాలంగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ వైఫల్యం, పర్యవేక్షణ లోపంతో కలుషిత ఆహారం కారణంగా బాల్యం అనారోగ్యం పాలవుతోంది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 జూలైలో జీవో నెంబర్ 46 జారీ చేసింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాలు, గురుకులాలు తదితర విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ, వాటిని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పేద విద్యార్థుల భద్రత, భవిత ఇబ్బందుల్లో పడింది. నోట్లో ముద్ద పెట్టుకోవాలంటే భయం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రధానంగా భోజనంలో నాణ్యత పూర్తిగా లోపించింది. మచిలీపట్నంలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో తాగునీటి సౌకర్యం సరిగా లేదు. ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు చినిగిపోయాయి. దుప్పట్లు ఇంత వరకు పంపిణీ చేయలేదు. మరుగుదొడ్ల నిర్వహణ ఘోరంగా ఉంది. పెడన బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో ఎవరూ ఉండటం లేదు. పిల్లలు రోజూ ఉదయం టిఫిన్, రాత్రి భోజనం చేసి వెళ్లిపోతున్నారు. గుడివాడలో పిల్లలకు దోమతెరలు, గన్నవరంలో దుప్పట్లు ఇంత వరకు ఇవ్వలేదు. వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థులు చలికి వణికిపోతున్నారు. పొన్నూరులోని హాస్టళ్లలో పాడైన కూరగాయలతో చేసిన కూరలు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వండిన కూర ఉదయం కూడా పెడుతుండడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల పట్టణంలోని ఓ హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సౌకర్యాలు కల్పించాలి భీమవరం డీఎన్ఆర్ కళాశాలలో బీటెక్ చదువుతూ బీసీ బాలుర హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్లో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేదు. బెడ్లు లేక కింద పడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. కాస్మోటిక్స్ డబ్బులు కూడా జమ కావడం లేదు. సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి. – కె.గోపి, బీటెక్ విద్యార్థి,బీసీ బాలుర హాస్టల్–1, భీమవరం నేల మీదే నిద్ర గదిలోని గచ్చు మీద పడుకోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయి. మంచాలు లేవు, కనీసం పరుపులైనా ఇవ్వలేదు. గచ్చు మీద పడుకోవడంతో చీమలు, జెర్రిలు, ఇతర పురుగులతో ఇబ్బందులు పడుతున్నాం. – నాగవంశం సందీప్, పదో తరగతి, ఎస్సీ బాలుర వసతి గృహం, కొత్తూరు బ్యాగ్ కొనుక్కొని తెచ్చా మా వసతి గృహంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాస్మొటిక్స్ చార్జీలు, దుప్పట్లు, టవల్స్ త్వరితగతిన అందజేయాలి. హైస్కూల్లో ఇచ్చిన స్కూల్ బ్యాగు చిరిగిపోయింది. దీంతో నేను కొనుక్కున్న బ్యాగులో పుస్తకాలు పెట్టుకుంటున్నాను. నేనే కాదు నా మిత్రులు కూడా సొంత బ్యాగులు తెచ్చుకుంటున్నారు. – ఎం కార్తీక్, పదో తరగతి విద్యార్థి, సమీకృత వసతి గృహం, మచిలీపట్నం, కృష్ణాజిల్లా -
26% డైట్ చార్జీలు పెంపు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలతో సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల డైట్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం 26% పెంచింది. డైట్ చార్జీల పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సబ్ కమిటీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ సీఎం కేసీ ఆర్ శనివారం రాష్ట్ర సచివాలయంలో సంతకం చేశారు. పెరి గిన డైట్ చార్జీలు జూలై నుంచి అమలులోకి రానున్నాయి. గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, వెనకబడిన తరగతులు సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లోని 7.5 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీల పెంపుతో ప్రయోజనం చేకూరనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.237.24 కోట్ల అదనపు భారం పడనున్నా లెక్కచేయకుండా విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సన్నబియ్యం అన్నంతో చక్కటి భోజనాన్ని ఇప్పటికే అందిస్తున్నామ న్నారు. ఇప్పుడు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించేందుకే డైట్ చార్జీలు పెంచామని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. డైట్ చార్జీల పెంపు నిర్ణయంపై మంత్రులు హర్షం సాక్షి, హైదరాబాద్: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో సంక్షేమ విద్యార్థుల డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ఏపీ సర్కారు వరం
సాక్షి, అమరావతి: బలహీన వర్గాల పిల్లల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకుంది. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు విషయంలో ఎల్లో మీడియా ఎంత రాద్ధాంతం చేసినా తమది మాటల వంటకం కాదని.. చేతల ప్రభుత్వమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా నిరూపించారు. ఈ ఛార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం జీఓ–8, 9 ఉత్తర్వులు జారీచేశారు. బడ్జెట్లో కన్నా అధికంగా కేటాయింపు రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో డైట్ చార్జీలకు రూ.755 కోట్లు, కాస్మోటిక్ చార్జీలకు రూ.78 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. తాజాగా.. ఈ చార్జీలను పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.160 కోట్ల అదనపు భారం పడుతుంది. వీటిలో డైట్ చార్జీలకు రూ.112 కోట్లు, కాస్మోటిక్ చార్జీలకు రూ.48 కోట్లు ప్రభుత్వం అదనంగా కేటాయిస్తోంది. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదివే హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విషయంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సర్కారుకు వారిపట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో రాష్ట్రంలో 5.92 లక్షల మంది బడుగు, బలహీనవర్గాల పిల్లలకు మేలు చేకూరుతుంది. బాబు బకాయిలు రూ.132 కోట్ల చెల్లింపు నిజానికి.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ చార్జీలను 2012లో పెంచారు. అప్పటి నుంచి ఆరేళ్లపాటు వాటిని పట్టించుకున్న నాధుడే లేడు. 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా, మొక్కుబడిగా 2018 జూన్ 5న డైట్ చార్జీలు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనిని 2018 జూలై 1 నుంచి అమలులోకి తెచ్చారు. కానీ, వాటిని కూడా సక్రమంగా అమలుచేయలేదు. 2018 జూలై నుంచి 2019 ఫిబ్రవరి వరకు కేవలం ఎనిమిది నెలల కాలానికి మాత్రమే తూతూమంత్రంగా అమలుచేసింది. పైగా డైట్ చార్జీలు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. దీంతో రూ.132 కోట్ల బకాయిలను సీఎం వైఎస్ జగన్ సర్కార్ చెల్లించింది. చంద్రబాబు కోసమే ఈనాడు వంకర రాతలు వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర సంక్షేమ విద్యా సంస్థల్లోని బోర్డర్ల (విద్యార్థులు)కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచేందుకు సీఎం వైఎస్ జగన్ పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఏర్పాటుచేసిన కమిటీ సూచనల మేరకు ప్రతిపాదనలు రూపొందించారు. వాటిని సర్కారు ఆమోదించే తరుణంలో చంద్రబాబు ప్రయోజనాల కోసం ‘మాటల వంటకం’ అంటూ ఈనాడు ఇటీవలే విషప్రచారం చేసింది. -
AP: మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా విద్యార్థుల డైట్ చార్జీల పెంపు!
అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు మంచి ఆహారం అందించే లక్ష్యంగా డైట్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్పీ, ఎస్టీ హాస్టల్ గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డైట్ చార్జీల పెంపు ఉత్తర్వులను సీఎస్ జవహర్‌రెడ్డి జారీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలు వివరాలు ఇలా ఉన్నాయి.. 3,4 తరగతుల విద్యార్థుల డైట్ చార్జీలు 1150 కి పెంపు 5 నుండి 10 వ తరగతి విద్యార్థుల డైట్ చార్జీలు 1400 కి పెంపు ఇంటర్ ఆపై విద్యార్థులకు డైట్ చార్జీలు 1600 కి పెంపు డైట్ ఛార్జీలతో పాటు విద్యార్థులకు నెల నెలా ఇచ్చే కాస్మొటిక్ ఛార్జీ లు పెంపు -
అప్పు చేసి హాస్టల్ కూడు!
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఇది వరకు అప్పు చేసి పప్పు కూడు తినేవారేమో. ఇప్పుడు హాస్టల్ కూడు పెట్టడానికి కూడా అప్పు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మెనూలు మార్చడం, కాగితాల్లో డైట్ చార్జీలు పెంచడం చేస్తోంది గానీ.. మెనూ అమలు చేయడానికి కావాల్సిన డబ్బులు ఇవ్వడంలో మాత్రం ఎక్కడలేని పిసినారితనం చూపుతోంది. ఫలితంగా విద్యార్థులకు వండి పెట్టడానికి వసతి గృహ సంక్షేమాధికారులు అప్పులు చేయాల్సి వస్తోంది. డైట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే జీఓ విడుదల చేసింది. అయితే పెంచిన చార్జీలు వసతి గృహ అధికారులకు అందడం లేదు. నిధుల విడుదల లేకపోవడంతో కొత్త మెనూ అమలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ప్రధానంగా బీసీ వసతి గృహాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో కొత్త మెనూ అమలు చేయాలంటే అధి కారులకు భారంగా మారుతోంది. ఒక్కో సంక్షేమ వసతి గృహం అధికారికి అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.4 లక్షల నుంచి రూ.6లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. హాస్టళ్లలో సరుకుల కోసం వార్డెన్లు చేసిన అప్పులే ఇవి. ఇంకా ఈ బిల్లులు మంజూరు కాకపోవడంతో కొందరు వార్డెన్లకు అప్పు కూడా దొరకని పరిస్థితి ఉంది. అధ్యయనం చేసినా.. రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణపై ఓ కమిటీ అధ్యయనం చేసి మహారాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాల్లో అమలు చేస్తున్న డైట్‌ను ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా అదే మెనూ అమలు చేయాలని నిర్ణయించారు. అయితే మెనూ మార్చినా అప్పటి కి చార్జీలు పెంచలేదు. పెరుగుతున్న ధరలకు ఈ మెస్ చార్జీలు అస్సలు సరిపోవు. ప్రీ మెట్రిక్ వారి కంటే పోస్టు మెట్రిక్ వారికి మరింత ఇబ్బంది ఉంది. వారికి పెరిగిన ధరతో పాటు ఒక పూట భోజనం అదనంగా ఉంటుంది. దీంతో వారికి ఇబ్బం దిగా మారుతోంది. ఇటీవల జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా, ఆ పథకం ఇంకా పురిటి దశలో సమస్యల్లోనే ఉంది. జూలై ఒకటి నుంచి నూతన డైట్ విధానం అమలు చేయాలని జీఓ 82ను విడుదల చేసింది. వారంలో మూడు రోజు లు కోడి కూర ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆదేశాలు బాగానే ఉన్నా వసతి గృహాలకు, డైట్, కాస్మొటిక్ చార్జీలు చెల్లించలేదు. రూ.5.2 కోట్ల బకాయిలు జిల్లాలో బీసీ, ఎస్సీ వసతి గృహాలు 132 ఉన్నా యి. వీటిలో సుమారు 19వేల మంది చదువుతున్నారు. ఒక్కో వసతి గృహానికి రూ.4లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మెస్ చార్జీలు బకాయిలు ఉన్నాయి. మొత్తం కలిపి రూ.5.2 కోట్ల వరకు రావాల్సి ఉంది. అలాగే బీసీ వసతి గృహాలకు, ఎస్సీ వసతి గృహాలకు ఐదు నెలల డైట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వస తి గృహ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసిన భోజనాలు పెడుతున్నామని, ఇప్పుడు కొత్త అప్పులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు తీయలేరు..! గతంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సంక్షేమాధికారులకే నిధులు డ్రా చేసే అధికారాలు ఉండేవి. కొత్త పద్ధతిలో ఈ డ్రాయింగ్ అధి కారాలు ఏబీసీడబ్ల్యూ, లేదా ఏఎస్డబ్ల్యూలకు అప్పగించారు. దీని వల్ల బిల్లులు పెట్టడం సమస్యగా మారింది. ఖజానాలకు బిల్లులు వెల్లడంలోనూ, అ బిల్లులు ఆమోదం పొందడంలోనూ తీవ్ర జాప్యం అవుతోంది. సన్నబియ్యం మాటే లేదు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బి య్యం అందిస్తామని పాలకులు చాలాసార్లు హా మీ ఇచ్చారు. ఈ సారి మెనూ చార్జీలు పెంచినా ఈ బియ్యం విషయం మాత్రం ప్రస్తావనకు రాలేదు. ఇప్పుడు ఇస్తున్న పీడీఎస్ బియ్యం కొన్ని సార్లు నాసిరకంగా వస్తోంది. బియ్యం మినహా మిగిలిన సరుకులు, కూరగాయలు, చికెన్, గుడ్లు, పాలు, అరటి పండ్లు మొదలైనవి సంక్షేమాధికారులు కొ నుగోలు చేయాలి. అయితే వ్యాపారులు అరువులు ఇవ్వడం లేదని వారు చెబుతున్నారు. పెంచిన డైట్ చార్జీల మేరకు ప్రతి విద్యార్థికి రోజుకు రూ. 38.70 పడుతుందని, కానీ మెనూ యథావిధిగా అమలు చేయడానికి రూ.50 ఖర్చు పెట్టాల్సి ఉం టుందని వార్డెన్లు చెబుతున్నారు. అలాగే ఆహార పట్టికలో పరిమాణం, ధరలు నిర్ణయించలేదు. దీంతో వార్డెన్లలో అయోమయం నెలకొంది. కొత్త మెనూ అమలు చేయడానికి నాల్గో తరగతి ఉద్యోగుల కొరత కూడా ఉంది. మెనూ కచ్చితంగా అమలు చేస్తాం ఈ విషయంపై బీసీ సంక్షేమ శాఖ అధికారి కె. శ్రీదేవి వద్ద ప్రస్తావించగా, మెనూ కచ్చితంగా పాటించాలన్నారు. సీఎఫ్ఎంఎస్ విధానం కొత్తది కావడంతో ఇబ్బంది ఉందని, అయితే బిల్లులు పెట్టి సిద్ధంగా ఉన్నామని, వాటిని వసతి గృహ అధికారులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సంక్షామం
♦ నాలుగు నెలలుగా అందని డైట్ చార్జీలు ♦ రెండు నెలలుగా ట్యూటర్లకు అందని గౌరవ వేతనం ♦ వార్డెన్లకు తప్పని ఎదురుచూపులు సాక్షి, కడప : వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు చెందిన వసతి గృహాలు ప్రస్తుతం నిధులు లేక నీరసిస్తున్నాయి. విద్యార్థులకు ప్రతినిత్యం ఆహారం అందించే వార్డన్లకు ఇంతవరకూ డైట్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆకలి కేకలు తప్పడంలేదు. మొన్నటి వరకు గురుకులాల్లో ఇదే సమస్య నెలకొనగా.. తాజాగా బీసీ సంక్షేమశాఖను ఈ సమస్య వెంటాడుతోంది. ప్రభుత్వం, ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. కోట్లలో బిల్లులు పెండింగ్.. జిల్లాలో సుమారు 59 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. అందులో సుమారు 4 నుంచి 5 వేల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రతినిత్యం మెనూ ప్రకారం భోజనం, టిఫిన్, పాలు, గుడ్డు, అరటిపండు లాంటి ఆహారాన్ని సంబంధిత వార్డెన్ అందజేయాల్సి ఉంది. అనంతరం అయిన ఖర్చులను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తూ వస్తోంది. అయితే ప్రస్తుత తరుణంలో కొన్ని హాస్టళ్లకు 2014 డిసెంబర్ నుంచి డైట్ చార్జీలు రాకపోగా.. మరికొన్ని హాస్టళ్లకు జనవరి నుంచి మూడు నెలలుగా డైట్ ఛార్జీలు అందలేదు. కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులకు సరైన ఆహారం అందించడం వార్డన్లకు తలకుమించిన భారంగా మారింది. ఇప్పటికే ఒక్కో వార్డెన్‌కు దాదాపు రూ. మూడు లక్షల మేర బిల్లులు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా లెక్కకడితే కోట్లల్లో డైట్‌ఛార్జీలు రావాల్సి ఉంది. భారంగా మారిన మెనూ.. బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ప్రతి నిత్యం మెనూ ప్రకారం ఆహారం అందించడం వార్డెన్లకు సమస్యగా మారింది. ఎందుకంటే మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో ప్రస్తుత మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలంటే కష్టంగా మారింది. దీంతో మెనూలోని కొన్ని ఆహార పదార్థాలకు వార్డెన్లు మంగళం పాడినట్లు తెలుస్తోంది. రెండు నెలలుగా ట్యూటర్లకూ అందని జీతం.. బీసీ సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న ట్యూటర్లకు కూడా రెండు నెలలుగా గౌరవ వేతనం అందకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రెండు నెలలుగా గౌరవ వేతనం రావాల్సి ఉంది. వెంటనే గౌరవ వేతనం అందించి కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని ట్యూటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది :- విల్సన్, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి ప్రభుత్వం నుంచి బీసీ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు రావాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేస్తే పంపిణీకి చర్యలు తీసుకుంటాం. ట్యూటర్లకు గౌరవ వేతనం అందాల్సి ఉంది. డైట్ ఛార్జీలు నాలుగు నెలలకు సంబంధించి రావాలి.