పిల్లలకు ప్రత్యక్ష నరకం | Students facing several problems in welfare hostels and gurukuls | Sakshi
Sakshi News home page

పిల్లలకు ప్రత్యక్ష నరకం

Jul 26 2025 4:35 AM | Updated on Jul 26 2025 8:44 AM

Students facing several problems in welfare hostels and gurukuls

నీళ్ల పప్పు.. నేలపై నిద్ర.. దోమల మోత! 

ఇదీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల దుస్థితి

ఇప్పటి దాకా పంపిణీ కాని దుప్పట్లు, దోమ తెరలు

సరిపడా స్నానపు గదులు, మరుగు దొడ్లు లేక ఇక్కట్లు

క్యూ కడుతున్న బాలికలు.. ఆరు బయటే బాలుర స్నానాలు 

నిధుల కొరతతో మెనూ ఏమాత్రం పాటించని వైనం

చెడిపోయిన, నాణ్యత లేని కూరగాయలతో వంట

ఆహారం కలుషితమై తరచూ రోగాలబారిన పడుతున్న పిల్లలు

చాలా హాస్టళ్లు భోజనాలకే పరిమితం.. రాత్రిళ్లు పిల్లలు ఇంటి ముఖం

మరోవైపు డైట్, కాస్మొటిక్‌ చార్జీలు అందక సతమతం

ఊరూరా ప్రతి హాస్టల్‌లోనూ సమస్యలు తిష్ట.. మాటలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం 

హైకోర్టు తప్పు పట్టినా మొద్దు నిద్ర వీడని చంద్రబాబు సర్కారు

వెరసి 3,878 వసతి గృహాలు, గురుకులాల్లో 6,35,864 మంది విద్యార్థుల అవస్థలు 

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని 3,878 ప్రభుత్వ వసతి గృహాలు(హాస్టల్స్‌), గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడుపు నిండా తిండి లేక, రాత్రిళ్లు నిద్ర లేక సతమతమవుతున్నారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల పప్పు, సాంబారుతోనే పిల్లలకు భోజనం పెడుతున్నారు. అధిక శాతం హాస్టళ్లకు ఇప్పటిదాకా దుప్పట్లు, దోమ తెరలు పంపిణీ కాలేదు. సరిపడా స్నానపు గదులు, మరుగు దొడ్లు లేక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాలికలైతే ఉదయాన్నే వాష్‌ రూమ్‌ల ఎదుట క్యూ కడుతున్నారు. బాలురైతే ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. 

సమయానికి డైట్‌ చార్జీలను ప్రభుత్వం ఇవ్వక పోవడంతో మెనూలో నాణ్యత పూర్తిగా లోపించింది. చాలా మంది వార్డెన్లు సరుకులు అప్పుగా తీసుకొ­స్తున్నారు. ఈ క్రమంలో చెడిపోయిన, నాణ్యత లేని కూరగాయలతో వంట చేస్తున్నారు. ఫలితంగా ఆహారం కలుషితమై పిల్లలు తరచూ రోగాలబారిన పడుతున్నారు. చాలా హాస్టళ్లు భోజనాలకే పరిమితమవుతున్నాయి. వసతులు లేనందున రాత్రిళ్లు పిల్లలు ఇళ్లకు వెళ్లిపో­తున్నారు. కళాశాలకు వెళ్లే విద్యార్థులకు మధ్యా­హ్న భోజనం అందడం లేదు. ఉదయాన్నే వంట పూర్తి కాక చాలా మంది పస్తులుంటున్నారు. 

మరికొన్ని చోట్ల కేవలం తెల్లన్నం బాక్స్‌లో పెట్టుకుని వెళ్తున్నారు. మరోవైపు కాస్మొటిక్‌ చార్జీలు కూడా అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. చాలా హాస్టళ్లు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. సమీపంలోనే మురుగు నీటిలో పందులు తిరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లను ‘సాక్షి’ బృందం సందర్శించినప్పుడు దాదాపు అన్ని హాస్టళ్లలో ఇదే దుస్థితి కనిపించింది.   

అన్నీ బకాయిలే 
ప్రతి సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి ఒక దుప్పటి, ఒక కార్పెట్, రెండు టవళ్లు, ప్లేటు, గ్లాసు, బౌలు, ట్రంకు పెట్టె ఇవ్వాల్సి ఉండగా, అరకొరగా అందించి అయ్యిందనిపించారు. ఒక్కొక్కరికి రూ.46 చొప్పున డైట్‌ బిల్లు (మెస్‌ చార్జీలు) సైతం సకాలంలో ఇవ్వకుండా పెండింగ్‌ పెడుతున్నారు. దీన్ని సాకుగా తీసుకున్న హాస్టల్, గురుకులాల నిర్వాహకులు విద్యార్థులకు అందించే మెనూలో కోత పెడుతున్నారు. ప్రతి రోజు అందించాల్సిన గుడ్డు, వేరుశనగ చిక్కీ, వారానికి రెండు సార్లు చికెన్‌ సైతం సరిగా ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

ప్రతి నెలా ఇవ్వాల్సిన కాస్మొటిక్‌ చార్జీలు, బార్బర్‌ ఖర్చులను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌ అద్దె భవనాలకు సైతం ఐదు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో హాస్టల్, గురుకులానికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు చొప్పున ఏడాదికి ముందే ఇవ్వాల్సిన కంటింజెంట్‌ బిల్స్‌ కూడా మంజూరు చేయకపోవడంతో స్టేషనరీ, నిత్యావసర వస్తువులు, హెల్త్‌ కిట్స్, రిపేర్లు వంటి అత్యవసరమైన వాటికి అవస్థలు తప్పడం లేదు.

 ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,878 ప్రభుత్వ వసతి గృహాలు(హాస్టల్స్‌), గురుకుల విద్యాలయాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 6,35,864 మంది విద్యార్థులు అవస్థలపాలవుతున్నారు. వసతుల లేమి, ఆరోగ్య సమస్యలు, నిర్వహణ వైఫల్యం, ఆర్థిక సమస్యలు విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు సైతం ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. హాస్టల్స్, గురుకులాల్లో ఉండే పేద పిల్లలకు మెరుగైన వసతులు కల్పిస్తామంటూ కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. 

మెనూ కచ్చితంగా అమలుకాకపోగా చాలా చోట్ల కలుషిత ఆహారం, నిల్వ ఆహారంతో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనకాపల్లి, శ్రీకాకుళం, తిరుపతి, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లోని వసతి గృహాలు, గురుకులాల్లో కలుషిత ఆహారం కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.   

మంత్రుల సొంతూళ్లలోనూ 
అదే దుస్థితి  230 మందికి ఆరు చిన్న గదులు.. నీటి కొరత, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, మంచాలు లేక కటిక నేలపైనే నిద్ర, అధ్వానంగా మరుగుదొడ్లు ఇదీ సంక్షేమ శాఖ మంత్రి డోలా  బాల వీరాంజనేయస్వామి సొంత జిల్లా ప్రకాశంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితి. ఒంగోలు బాలికల వసతి గృహాల్లో ఉదయం మరుగుదొడ్ల వద్ద భారీ క్యూ కనిపిస్తోంది. దీంతో సమయానికి కళాశాలకు వెళ్లలేకపోతున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని హాస్టళ్లలో పారిశుద్ధ్య లేమి, తలుపులు లేని మరుగుదొడ్లు, విరిగిపోయిన బల్లలు, కలుషిత తాగునీరు, విద్యుత్‌ కోతలు, దోమల బెడద.. తదితర సమస్యల మధ్య విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. 

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అన్ని సౌకర్యాలు కల్పించామని అధికార కూటమి ప్రజాప్రతినిధులు మాత్రం ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారు. భోజనం తినలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ హాస్టళ్లలో పిల్లలు నేలపైనే నిద్రిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోని హాస్టళ్లలో మంచి నీటి సౌకర్యం సరిగా లేదు. మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదు. రాయలసీమ జిల్లాల్లోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించక పోవడంతో సమస్యలు తాండవిస్తున్నాయి. 

విద్యార్థులకు సరిపడా గదులు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలికల హాస్టళ్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక శాఖలకు చెందిన బీసీ సంక్షేమశాఖ, ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రులు ఉన్నా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయం. చాలా చోట్ల బాత్‌రూంలు శుభ్రంగా ఉంచక పోవడంతో విద్యార్థులు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు.  

భద్రత గాలికి..  
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న భావితరం భద్రతను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాల నిర్వహణలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏడాది కాలంగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. 

టీడీపీ ప్రభుత్వ వైఫల్యం, పర్యవేక్షణ లోపంతో కలుషిత ఆహారం కారణంగా బాల్యం అనారోగ్యం పాలవుతోంది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 జూలైలో జీవో నెంబర్‌ 46 జారీ చేసింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాలు, గురుకులాలు తదితర విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ, వాటిని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పేద విద్యార్థుల భద్రత, భవిత ఇబ్బందుల్లో పడింది.  

నోట్లో ముద్ద పెట్టుకోవాలంటే భయం 
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రధానంగా భోజనంలో నాణ్యత పూర్తిగా లోపించింది. మచిలీపట్నంలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో తాగునీటి సౌకర్యం సరిగా లేదు. ప్రభు­త్వం ఇచ్చిన బ్యాగులు చినిగిపోయాయి. దుప్పట్లు ఇంత వరకు పంపిణీ చేయలేదు. మరుగుదొడ్ల నిర్వహణ ఘోరంగా ఉంది. పెడన బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో ఎవరూ ఉండటం లేదు. పిల్లలు రోజూ ఉదయం టిఫిన్, రాత్రి భోజ­నం చేసి వెళ్లిపోతున్నారు. 

గుడివాడలో పిల్లలకు దోమతెరలు, గన్నవరంలో దుప్పట్లు ఇంత వరకు ఇవ్వలేదు. వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థులు చలికి వణికిపోతున్నారు. పొన్నూరులోని హాస్టళ్లలో పాడైన కూరగాయలతో చేసిన కూరలు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వండిన కూర ఉదయం కూడా పెడుతుండడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతు­న్నారు. ఇటీవల పట్టణంలోని ఓ హాస్టల్లో కలుషి­త ఆహారం తిని ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.    

సౌకర్యాలు కల్పించాలి 
భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతూ బీసీ బాలుర హాస్టల్‌లో ఉంటున్నాను. హాస్టల్‌లో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేదు. బెడ్లు లేక కింద పడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. కాస్మోటిక్స్‌ డబ్బులు కూడా జమ కావడం లేదు. సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి.  – కె.గోపి, బీటెక్‌ విద్యార్థి,బీసీ బాలుర హాస్టల్‌–1, భీమవరం 

నేల మీదే నిద్ర  
గదిలోని గచ్చు మీద పడుకోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయి. మంచాలు లేవు, కనీసం పరుపులైనా ఇవ్వలేదు. గచ్చు మీద పడుకోవడంతో చీమలు, జెర్రిలు, ఇతర పురుగులతో ఇబ్బందులు పడుతున్నాం.  – నాగవంశం సందీప్, పదో తరగతి, ఎస్సీ బాలుర వసతి గృహం, కొత్తూరు 

బ్యాగ్‌ కొనుక్కొని తెచ్చా 
మా వసతి గృహంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాస్మొటిక్స్‌ చార్జీలు, దుప్పట్లు, టవల్స్‌ త్వరితగతిన అందజేయాలి. హైస్కూల్లో ఇచ్చిన స్కూల్‌ బ్యాగు చిరిగిపోయింది. దీంతో నేను కొను­క్కున్న బ్యాగులో పుస్తకాలు పెట్టుకుంటున్నాను. నేనే కాదు నా మిత్రులు కూడా సొంత బ్యాగులు తెచ్చుకుంటున్నారు.     – ఎం కార్తీక్, పదో తరగతి విద్యార్థి, సమీకృత వసతి గృహం, మచిలీపట్నం, కృష్ణాజిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement