కరెంట్‌ కష్టాలకు చెక్‌..  పునరుత్పాదక విద్యుత్‌కు ప్రణాళిక

Andhra Pradesh Govt Focus On Electricity Problems - Sakshi

పంప్డ్‌ హైడ్రో స్టోరేజి పవర్‌ ప్రోజెక్టులపై కేంద్రానికి ఫీజిబిలిటీ రిపోర్ట్‌ అందచేసిన ఏపీ

వివిధ జిల్లాల్లో 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు

బొగ్గు సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక  

రాష్ట్రంలోని సహజ వనరుల వినియోగంతో భారీగా విద్యుదుత్పత్తి, ఎగుమతికి ప్రయత్నాలు 

భవిష్యత్తులో నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఢోకాలేకుండా చర్యలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్ముందు కరెంట్‌ కష్టాలు తలెత్తకుండా.. పుష్కలంగా విద్యుత్‌ అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్‌ కొరత నేపథ్యంలో రాష్ట్రానికి విద్యుత్‌ భద్రత కల్పించే లక్ష్యంతో 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ (పీఎస్‌పీ) ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి పుష్కలంగా నిరంతర విద్యుత్‌ అందుబాటులోకి రావడంతో పాటు ఇంధన రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయి. అంతేకాక.. మన విద్యుత్‌ అవసరాలు తీర్చుకుంటూనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఉండటంతో, రాష్ట్రానికి ఆదాయం సమకూరనుంది.

రిపోర్టులన్నీ సిద్ధం..
రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల 33,240 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ పీఎస్‌పీ ప్రాజెక్టులకు సంబంధించి టెక్నో కమర్షియల్‌ ఫీజిబిలిటీ రిపోర్ట్‌లను అధికారులు రూపొందించారు. మొదటి దశలో 6,600 మెగావాట్ల సామర్థ్యంతో ఏడుచోట్ల నిర్మించే ప్రాజెక్టుల డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)ను తయారుచేస్తున్నారు. వీటిలో నాలుగు రిజర్వాయర్ల ఆధారిత ఆన్‌ రివర్‌ ప్రాజెక్టులు కాగా.. మరో మూడు ఆఫ్‌ రివర్‌ ప్రాజెక్టులని అధికారులు చెబుతున్నారు. ఇక మొదటి దశలో ఏర్పాటుచేసే ప్రాజెక్టుల ఫీజిబిలిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్లకు అధికారులు పంపించారు.

గండికోట, కురుకుట్టి, కర్రివలసల్లో ఏర్పాటుచేసే పీఎస్‌పీ ప్రాజెక్టులకు సంబంధించి డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (డీజీపీఎస్‌) సర్వేను పూర్తిచేశారు. అలాగే.. చిత్రావతి, గండికోట, సోమశిల, కురుకుట్టి, కర్రివలసలలో ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. రెండో దశలో ఏర్పాటుచేసే ప్రాజెక్టుల ఫీజిబిలిటీ రిపోర్టులను కూడా న్యూ–రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) అధికారులు రూపొందిస్తున్నారు.

ఆదాయంతోపాటు యువతకు ఉపాధి
ప్రతి వినియోగదారునికి ఇరవై 4 గంటలూ విద్యుత్‌ సరఫరాను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి పీఎస్‌పీ ప్రాజెక్టులు దోహదపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెన్యువబుల్‌ ఇంధన ఎగుమతి విధానం కింద పీఎస్‌పీ ప్రాజెక్టుల్లో తయారయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది. అదే విధంగా వీటివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది.  
 – ఎస్‌ రమణారెడ్డి, వైస్‌చైర్మన్‌/ఎండీ, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top