త్వరలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ
పదవులు ఆశిస్తున్న పలువురు సీనియర్లు
ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్న దేవినేని ఉమ, వంగవీటి రాధా, పిఠాపురం వర్మ
రేసులో కర్రోతు బంగార్రాజు, మహాసేన రాజేష్, వర్ల రామయ్య
సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్థితిని బేరీజు వేస్తున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడానికి తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు పలువురు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలలో ఖాళీ అవుతున్న గవర్నర్ నామినేటెడ్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూటమిలోని టీడీపీకే వెళ్లే అవకాశం ఉండటంతో ఆ పార్టీలోని ఆశావహులు పైరవీలు ముమ్మరం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కారణంగా టికెట్లు దక్కని వారు, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేసినా గుర్తింపు దక్కని సీనియర్లు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం వారి ఆర్థిక స్థితిని బేరీజు వేసి, వారికే ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
రేసులో ఉన్నది వీరే
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ సీటు కోసం చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ నాయకులంతా ఆయనకు వ్యతిరేకంగా ఉండడం మైనస్‌గా మారింది. కృష్ణా జిల్లాలోనే మరో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పేరు ఈసారి బలంగా వినిపిస్తోంది. ఈ దఫా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. అయితే రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. రాధాను ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఆయన సామాజికవర్గ నేతలు పలువురు వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది.
పరిశీలనలో రాయలసీమ నేతల పేర్లు?
రాయలసీమ నుంచి కొందరి పేర్లను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ స్థానం ఆశించి భంగపడ్డ
కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి వంటి వారికి ఇస్తే ఎలా ఉంటుందని కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అన్ని విషయాల్లో చంద్రబాబు కోస్తా ప్రాంతానికి పెద్దపీట వేస్తున్నారనే అభిప్రాయాలు ఉండటంతో రాయలసీమకు వారికి అవకాశం ఇవ్వాలని ఆ ప్రాంత నాయకులు గట్టిగా కోరుతున్నారు.
వర్మకు ఈసారీ మొండిచేయే?
పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఈసారి తనకు కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన తన అనుయాయులతో చెబుతున్నట్లు సమాచారం. అయితే వర్మకు పదవి ఇవ్వడం అంత తేలిక కాదని టీడీపీలోనే చర్చ జరుగుతోంది. వర్మకు ఏ పదవి ఇచ్చినా పిఠాపురంలో తనకు పోటీగా మారతారని, కాబట్టి ఎలాంటి పదవీ ఇవ్వవద్దని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా గతంలోనే ప్రచారం జరిగింది. అందుకే రెండేళ్లుగా వర్మకు ఎలాంటి పదవీ దక్కకపోగా పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి కూడా తప్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఆయనకు ఎలా ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మరికొందరు ఆశావహులు
నెల్లిమర్ల సీటును జనసేనకు వదులుకున్న మార్క్‌ఫెడ్ ఛైర్మన్, విజయనగరం జిల్లాకు చెందిన కర్రోతు బంగార్రాజు ఎమ్మెల్సీ పదవి కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్టిచ్చినా, తీవ్ర ఆరోపణల కారణంగా దాన్ని వదులుకొన్న మహాసేన రాజేష్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఇటీవల రాజ్యసభ స్థానం ఇస్తారని చివరి నిమిషం వరకూ ప్రచారం జరిగింది. ఎప్పటి మాదిరిగానే మొండిచేయి చూపడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపైనా సమాలోచనలు జరుగుతున్నాయి.


