వైద్యం.. కొత్త ముఖచిత్రం... నాలుగేళ్లలో విప్లవాత్మక సంస్కరణలు

Andhra Pradesh Government Revolutionary Reforms medical Sector - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో గ్రామీణుల ముంగిటకు వైద్య సేవలు 

ప్రభుత్వాస్పత్రుల్లో గతంతో పోలిస్తే పెరిగిన వైద్యులు, సిబ్బంది 

2019 నుంచి 48 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం

డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు మించి అందుబాటులో వైద్యులు, సిబ్బంది 

రూ.16 వేల కోట్లతో నాడు–నేడు కింద వైద్య సదుపాయాల కల్పన

17 వైద్య కళాశాలల ఏర్పాటుతో కొత్త చరిత్ర.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాలతో పేదలకు కొండంత అండ 

ఏకంగా 3,255 ప్రొసీజర్‌లకు ఉచిత వైద్యం.. నాలుగేళ్లలోనే రూ.8,302 కోట్లు ఖర్చు చేసిన సీఎం జగన్‌ ప్రభుత్వం  

మన బంధువులు, మిత్రులు, తెలిసిన వారెవరైనా మనకు తారసపడినప్పుడో లేక ఫోన్‌ చేసినప్పుడో వినిపించే తొలి పదం ‘బాగున్నారా..’ అని. ఆ తర్వాతే మిగతా విషయాలు. అంటే ఆరోగ్యంగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. అప్పుడే అన్ని పనులను సవ్యంగా చేసుకోగలమని.. దేన్నయినా సాధించుకో­గలమనే నమ్మకం ఉంటుంది. దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్య­తను గుర్తించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా, దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే గొప్పగా వైద్య, ఆరోగ్య రంగంపై శ్రద్ధ చూపుతోంది. అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బంది, కొత్త వైద్య.. నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటు, నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన, కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తోంది. మన ఇంట్లో వారికే బాగోలేకపోతే ఎలాంటి వైద్యం కోరుకుంటామో అచ్చంగా అలాంటి వైద్యాన్నే ప్రజల ముంగిటకు తీసు­కొచ్చింది. ఇతర రాష్ట్రాల­న్నీ శభాష్‌.. అనేలా విప్లవాత్మక సంస్కరణ­లతో ఈ రంగం ముఖ చిత్రాన్నే మార్చివేసింది.

అనంతపురం జిల్లా మండల కేంద్రమైన కంబదూరుకు చెందిన నాగమణెమ్మ ఎనిమిదేళ్ల క్రితం నరాల బలహీనత వ్యాధికి గురై మంచానికే పరిమితమైంది. భర్త గంగన్న, కొడుకు, కూతురు ఆమె బాగోగులు చూస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో భాగంగా ప్రస్తుతం నాగమణెమ్మ ఇంటి వద్దకు నెలలో రెండు సార్లు పీహెచ్‌సీ వైద్యుడు వస్తున్నాడు. ఆమెకు బీపీ చూసి, ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాడు. ఒకప్పుడు ఆసుపత్రికి పోవాలంటే ఆటో బాడుగకు తీసుకుని, ఇంట్లో వాళ్లు కష్టపడి తీసుకెళ్లేవాళ్లు. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు వ్యయ ప్రయాసలు తగ్గాయి. గతంలో వీలును బట్టి ఏదో ఒక ఆస్పత్రికి తీసుకెళ్లేవాళ్లు. ఒక్కోసారి ఒక్కో వైద్యుడి వద్దకు వెళ్లడంతో ఆమె ఆరోగ్య చరిత్రపై వారికి అవగాహన లేక మందులు, వైద్యం విషయంలో కొంత గందరగోళం ఉండేది. ఇప్పుడు ఒకే వైద్యుడు క్రమం తప్పకుండా నాగమణెమ్మకు వైద్యం అందిస్తుండటంతో ఆ ఇబ్బందులేవీ లేవు. ప్రస్తుతం ఇలా ఊరూరా వైద్య సేవలందించేలా ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.  

సాక్షి, అమరావతి : ప్రస్తుతం చిన్న చిన్న జబ్బులకు పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, పెద్దాస్పత్రులు, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లకుండా.. గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులు రోజు మార్చి రోజు తమకు కేటాయించిన విలేజ్‌ క్లినిక్స్‌కు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌(ఎంఎంయూ)తో పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు చూశాక, మధ్యాహ్నం నుంచి మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగుల గృహాలను సందర్శించి వారికి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు.

ఈ విధానంలో రాష్ట్రంలోని 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను నెలలో రెండు సార్లు పీహెచ్‌సీ వైద్యులు సందర్శిస్తున్నారు. ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్‌ కన్సల్టేషన్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటోంది. ఏ రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే.. ఇక్కడి నుంచే పెద్దాస్పత్రులకు రెఫర్‌ చేస్తారు. ఆ రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి తరలించడం, అక్కడ అతనికి వైద్యం అందేలా చూడటం వంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్‌ఎం చూస్తారు. వీరు విలేజ్‌ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు.    

1.17 కోట్ల వైద్య సేవలు 
ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ట్రయల్‌ రన్‌ను గత ఏడాదిలో ప్రారంభించి.. ఈ ఏడాది ఏప్రిల్‌ ఆరో తేదీన పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు. 10,032 విలేజ్‌ క్లినిక్‌లను వైద్యులు 1.14 లక్షల సార్లు సందర్శించారు. ఈ క్రమంలో 1,17,08,895 వైద్య సేవలు అందించారు.  

నాడు–నేడుతో మహర్దశ  
ఇది 2019కు ముందు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్‌సీ. నెర్రెలు చీలిన ప్రహరీ.. పిచ్చి మొక్కలు, గడ్డితో కూడిన ఆవరణ.. అపరిశుభ్ర వాతావరణం, కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు లేని దుస్థితి. ఇక్కడికి రావాలంటేనే రోగులు వణికిపోయేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఆస్పత్రిలో నాడు–నేడు కింద పనులు చేపట్టింది. కుర్చీలు, ఓపీ గదులు, 10 పడకలతో ఇన్‌ పేషెంట్‌ వార్డు, కాన్పుల గది ఇలా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. చూపించుకోవడానికి జనం క్యూ కడుతున్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, వాటికి శాశ్వత భవనాలు సమకూర్చే దిశగా అడుగులు వేశారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే సొంత భవనాలు ఉన్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు, పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తుండగా 882 చోట్ల పనులు పూర్తయి అధునాతనంగా ఆస్పత్రులు తయారయ్యాయి.

121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్‌ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ వైద్యులు, సిబ్బందిని నియమించారు. ప్రభుత్వ కృషి ఫలితంగా 443 ఆస్పత్రులకు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌(ఎన్‌క్వాష్‌) గుర్తింపుతో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. గుజరాత్, కేరళ, హరియాణా, తెలంగాణలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నాణ్యమైన ప్రసూతి సేవలకు గాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపులో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉంది.     

వైద్య విద్యలో నవశకం  
రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌లు చేపట్టాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటికే నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు త్వరలో అనుమతి రానుంది. ఫలితంగా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున 750 సీట్లు పెరగనున్నాయి.

2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు.. ఆ తర్వాతి ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్‌లో స్పెషలిస్ట్‌ వైద్యుల కొరతకు తావుండదు.    

ప్రజలకు ఆరోగ్యశ్రీ రక్ష  
సీఎం జగన్‌.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపే­తం చేశారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తేవడం ద్వారా 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1059 ప్రొసీజర్స్‌ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 3,255కు పెంచారు. పేద, మధ్యతరగతి ప్రజలు శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయంలో ఇబ్బందులు లేకుండా ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు.

దీని కింద 1519 రకాల ప్రొసీజర్‌లలో చికిత్స అనంతరం వైద్యుడు సూచించిన విశ్రాంతి సమయానికి రోజు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు.   

ఇంకా ఎన్నెన్నో సేవలు 
► 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌(ఎంఎంయూ), 108 అంబులెన్స్‌ సేవలను ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రతి మండలానికి ఒక్కొక్కటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సగటున 3300 మంది అంబులెన్స్‌ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను ప్రారంభంలో మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో ప్రతి సచివాలయాన్ని రెండు సార్లు నెలలో 104 ఎంఎంయూలు సందర్శించేలా మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది.  

► గత ఏడాది ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు.  

► డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా విలేజ్‌ క్లినిక్స్‌లో 105, పీహెచ్‌సీల్లో 172, సీహెచ్‌సీ ఏరియా ఆస్పత్రుల్లో 330 రకాల మందులను సమకూరుస్తున్నారు. బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు రోగులకు పెట్టే ఆహారం విషయంలోను నాణ్యత ఉండేలా చర్యలు తీసుకున్నారు.  

► వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంది. నీతి ఆయోగ్‌ వంటి సంస్థలు ప్రశంసించాయి. దేశంలో మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్యబీమా కల్పిస్తున్న రాష్ట్రం ఏపీ అని ‘హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఫర్‌ ఇండియాస్‌ మిస్సింగ్‌ మిడిల్‌ క్లాస్‌’ పేరుతో రూపొందించిన నివేదికలో నీతి ఆయోగ్‌ తెలిపింది.   

► క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్‌–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి.  

► దేశంలో వంద శాతం పీహెచ్‌సీలను 24/7 నడుపుతున్న రాష్ట్రం ఏపీ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు నివేదికల్లో స్పష్టం చేసింది.  
► హెపటైటిస్‌ నియంత్రణలో ఏపీ చర్యలు భేష్‌గా ఉంటున్నాయని కేంద్ర వైద్య శాఖ ప్రశంసిచింది. హైరిస్క్‌ వర్గాలకు ముందస్తుగా టీకా పంపిణీ చేపడుతున్న రాష్ట్రంగా కూడా రికార్డు సాధించింది. 

కొరతకు తావు లేకుండా.. 
రాష్ట్ర చరిత్రలో  కనీ వినీ ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటికి ఏకంగా 48,639 పోస్టులు భర్తీ చేశారు. ఇక్కడితో ఆగకుండా  ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అత్యవసర అనుమతులు ఇచ్చింది. దేశంలో స్పెషాలిటీ వైద్యులు కొరత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 61 శాతం మేర ఉండగా, ఏపీలో కేవలం 5 శాతం మేర ఉంటోంది. గైనకాలజిస్టుల సంఖ్య జాతీయ స్థాయి­లో కొరత 50 శాతం ఉంటే, ఏపీలో 1.4 శాతం మాత్రమే ఉంది. స్టాప్‌నర్స్‌ల కొరత 27 శాతం ఉంటే.. రాష్ట్రంలో కొరతకే ఆస్కారం లేదు. ఫలితంగా డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు మించి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 4,469 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు.   

సగటున రోజుకు 1,360 సర్జరీలు 
బోధనాస్పత్రుల్లో 2018–19లో సగటున రోజుకు 817 మైనర్, మేజర్‌ ఆపరేషన్‌లు నిర్వహించే వారు. 2022–23లో రోజుకు 1360 ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అప్పట్లో రోజుకు 19 వేల చొప్పున ఓపీలు, 1900 మేర ఐపీలు ఉండగా, గత ఏడాది 22 వేలకు పైగా ఓపీల చొప్పున 83.16 లక్షలు, ఐపీలు రోజుకు 2,253 చొప్పున 8.22 లక్షలు నమోదు అయ్యాయి. 

నాటికి, నేటికి ఎంత తేడా! 
కర్నూలు జీజీహెచ్‌లోని కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగంలో 2019కి ముందు ఒక డాక్టర్, ఆరుగురు నర్సులు, ముగ్గురు టెక్నికల్‌ సిబ్బంది మాత్రమే ఉండేవారు. ఉన్న ఒక్క వైద్యుడు సెలవు పెడితే అంతే సంగతులు. సీటీ సర్జన్‌ ఆపరేషన్‌ చేసే సమయంలో గుండె నుంచి రక్త ప్రసరణ నిలిపివేసి, మెషిన్‌ ద్వారా ఇతర శరీర భాగాలకు రక్తం సహా ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కీలకమైన మిషన్‌ను పర్ఫ్యూజనిస్ట్‌లు ఆపరేట్‌ చేస్తుంటారు. ఇంతటి కీలకమైన పోస్టు అప్పట్లో ఖాళీగా ఉండేది. దీంతో హైదరాబాద్‌ నుంచి కేసుల ప్రాతిపదికన పర్ఫ్యూజనిస్ట్‌ను పిలిపించుకుని సర్జరీలు చేసేవారు.

అత్యవసర సమయాల్లో రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లిపోయేవారు. దీంతో 2017–18లో ఈ విభాగంలో 120 సర్జరీలు మాత్రమే చేశారు. ఓపీలు నెలకు 80లోపే చూసేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ విభాగంలో అదనంగా ముగ్గురు వైద్యులు, నలుగురు నర్సులు, ముగ్గురు టెక్నీషియన్‌లు రావడంతో పాటు పర్ఫ్యూజనిస్ట్‌ పోస్టు భర్తీ అయింది. దీంతో 2022–23లో ఏకంగా 1600 ఓపీలు నమోదు అయ్యాయి.

మేజర్, మైనర్‌ కలిపి 566 సర్జరీలు చేశారు. మొత్తంగా 1500 పడకలున్న ఈ ఆస్పత్రిలో 2018–19లో 9.46 లక్షల ఓపీలు, 80 వేల ఐపీ, 29 వేల మైనర్, మేజర్‌ సర్జరీలు నమోదయ్యాయి. 2022–23లో 12 లక్షల మేర ఓపీ, లక్షకుపైగా ఐపీ సేవలు అందించడంతో పాటు, 41 వేల సర్జరీలు నిర్వహించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దాస్పత్రుల్లో పరిస్థితి మెరుగైంది. 

అనుబంధం ఏర్పడుతుంది 
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ చర్యలపై సరైన అవగాహన లేదు. ఈ క్రమంలో ఎంబీబీఎస్‌ వైద్యుడే నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడం మంచి పరిణామం. గర్భిణి, బాలింత.. బీపీ, మధుమేహం వ్యాధిగ్రస్తులను రెండు, మూడు సార్లు చూస్తే వైద్యుడు వారిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఆ వైద్యుడికి ప్రజలకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఇది రోగికి మానసికంగా బలాన్ని ఇస్తుంది. ఈ మానసిక బలం రోగి త్వరగా కోలుకోవడానికి ఎంతో ఉపయోగకరం.  
    – డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూల్‌ జీజీహెచ్‌ 
 
ప్రజారోగ్య రక్షణలో మంచి ఫలితాలు   

బీపీని నియంత్రణలో ఉంచుకోకపోవడంతో ప్రస్తుతం 20 శాతం పెరాలసిస్‌ కేసులు వస్తున్నాయి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారు. మన దగ్గర 60 శాతం గ్రామీణ జనాభా ఉంది. గ్రామాల్లో నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ పెరుగుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల కోసం 10–20 కి.మీ ప్రయాణించి చూపించుకోవడం వారికి అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో వైద్యుడే ఆయా గ్రామాలకు వెళ్లడం ప్రజారోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. భవిష్యత్‌లో గుండెపోటు, కిడ్నీ, మెదడు జబ్బుల బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది.  
    – డాక్టర్‌ బాబ్జీ, వైస్‌ చాన్స్‌లర్, వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top