పట్టణాలకు పచ్చందం

Andhra Pradesh Government Focus On Green Andhra With Plants - Sakshi

‘గ్రీన్‌ ఆంధ్రా’ దిశగా అడుగులు! 

సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పచ్చదనం పెంపు, సుందరీకరణకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో మొక్కలు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా పచ్చదనాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రజల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాల్‌ పెయింటింగ్‌ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై ఇటీవల ఎంపిక చేసిన మున్సిపల్‌ కమిషనర్లతో గ్రీన్‌ సిటీ చాలెంజ్‌ పేరుతో సచివాలయంలో నాలుగు రోజులపాటు వర్క్‌షాప్‌ కూడా నిర్వహించారు.

పట్టణాల్లో పచ్చదనం పెంపునకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. గ్రేడ్‌–1 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం 45 యూఎల్‌బీలను ఎంపిక చేశారు. ఈ వర్షాకాలంలో ఆ పట్టణాలు, నగరాల్లో సుమారు రూ.78.84 కోట్లతో కార్యక్రమాలు చేపడతారు. జూన్‌ 7 నాటికి అన్ని పనులకు స్థానిక సంస్థలు అనుమతులు మంజూరు చేసి, జూన్‌ 11 నాటికి టెండర్లు పిలవాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు ఆగస్టు 12 నాటికి ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ కూడా పచ్చదనానికి అనుసరించాల్సిన ప్రణాళికలను ప్రభుత్వానికి అందించింది. 

వివిధ పథకాల్లో గ్రీనింగ్‌ ప్రోగ్రామ్‌ 
రాష్ట్రంలోని యూఎల్‌బీల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్‌ పథకం కింద పార్కులు, మిషన్‌ కాంపోనెంట్‌ కింద గ్రీన్‌ స్పేస్‌ల అభివృద్ధితో పాటు కౌన్సిళ్ల అనుమతితో అవసరమైన మిగతా ప్రాంతాల్లో ప్రాజెక్టులను అమలు చేస్తారు. స్థానిక పట్టణ సంస్థల అభ్యర్థన మేరకు ఏపీ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది.

నిర్మాణ పనులు సైతం పర్యవేక్షిస్తుంది. పట్టణాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లు, రోడ్డు మధ్యన గల మీడియేషన్‌ పాయింట్లలో అందాన్నిచ్చే మొక్కలను పెంచుతారు. మొదటి దశలో ఎంపిక చేసిన యూఎల్‌బీల్లో గ్రీనింగ్, వాల్‌ పెయింటింగ్‌ కోసం రూ.78.84 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇందులో జనరల్‌ ఫండ్‌ రూ.45,26,39,000, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.25,84,19,000, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద మరో రూ.7,73,51,000 ఖర్చు చేస్తారు. 

తొలి దశలో ఎంపిక చేసిన యూఎల్‌బీలు 
శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, జీవీఎంసీ, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, నర్సాపూర్, తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, మచిలీపట్నం, గుడివాడ, వైఎస్సార్‌ తాడిగడప, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి, చిలకలూరిపేట, నర్సారావుపేట, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు–ఎన్, శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు, రాయచోటి, మదనపల్లి, కదిరి, ధర్మవరం, హిందూపురం, అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, కడప, ప్రొద్దుటూరు తొలి దశలో ఉన్నాయి. కార్పొరేషన్‌ స్థాయి గల జీవీఎంసీ అత్యధికంగా రూ.8.19 కోట్లు, విజయవాడ, గుంటూరు రూ.7 కోట్లు చొప్పున, ఒంగోలు, రాజమండ్రి కార్పొరేషన్లు రూ.5.50 కోట్లు చొప్పున, కర్నూలు రూ.4 కోట్లు వెచ్చించనున్నాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top