రూ.67కే కందిపప్పు

Andhra Pradesh Government distributing Toor Dal for Low price - Sakshi

చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం

రాష్ట్రంలో 26,770 టన్నుల నిల్వలు 

మూడు నెలల వరకు పంపిణీకి ఢోకా లేకుండా ఏర్పాట్లు

అరకేజీ ప్యాకెట్లలో పంచదార సరఫరా

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై కందిపప్పును పంపిణీ చేస్తూ ప్రభుత్వం పేదలకు ఊరటనిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కందిపప్పు ధర కిలో రూ.110కి పైగా ఉండటంతో సామాన్యులపై భారాన్ని తగ్గించేలా ఒక్కో కార్డుదారుడికి కిలో రూ.67కే ప్రభుత్వం అందిస్తోంది. అవసరమైన నిల్వలను కొత్త జిల్లాల వారీగా పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో పారదర్శకంగా సరఫరా చేస్తోంది. 

నెలకు 6,500 టన్నుల వినియోగం
రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్‌ కార్డుదారులకు కిలో చొప్పున పంపిణీ చేసేందుకు నెలకు 14,542 టన్నుల కందిపప్పు అవసరం అవుతుంది. ఐసీడీఎస్‌ పథకానికి మరో 1,097 టన్నులను వినియోగిస్తున్నారు. సగటున నెలకు రేషన్‌ దుకాణాల ద్వారా కేవలం 6,000 నుంచి 6,500 టన్నులు మాత్రమే విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మండల నిల్వ కేంద్రాల్లో (ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు) 1,771 టన్నుల సరుకు అందుబాటులో ఉంది. దీనికితోడు మరో 25 వేల టన్నుల సేకరణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు ఖరారు చేసి సరఫరాకు అనుమతులు ఇచ్చింది. దీంతో మొత్తం 26,770 టన్నులు కందిపప్పు నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ లెక్కన మూడు నెలల పాటు ఎటువంటి అవరోధం లేకుండా సబ్సిడీపై కందిపప్పు అందించనున్నారు. 

పంచదార కిలో రూ.34
రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం అర కిలో ప్యాకెట్ల రూపంలో పంచదారను సబ్సిడీపై అందిస్తోంది. ఒక్కో కార్డుకు గరిష్టంగా కిలో వరకు రూ.34కు ఇస్తుండగా మరో మూడు నెలల వరకు సరఫరాకు అంతరాయం లేకుండా నిల్వలను సమకూర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో 4,442 టన్నుల పంచదార నిల్వలు అందుబాటులో ఉండగా..  మరో 15,335 టన్నుల సేకరణకు టెండర్లను ఖరారు చేశారు. ప్రతి నెలా 5,500–6000 టన్నుల వరకు వినియోగం ఉంటోంది. 

3 నెలల వరకు ఢోకా లేదు
రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు మూడు నెలల పాటు సబ్సిడీపై కందిపప్పు, పంచదార అందించేందుకు అవసరమైన నిల్వలను సమకూర్చాం. ఇప్పటికే టెండర్లు పూర్తవగా.. వేగంగా సరుకును సరఫరా అయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. జిల్లాల్లో ఎక్కడైనా అత్యవసరంగా స్టాక్‌ అవసరమైతే పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేసేలా అధికారులను ఆదేశించాం. దాదాపు అన్ని మండల స్థాయి నిల్వ కేంద్రాలకు సరుకును అందుబాటులో ఉంచాం. వినియోగదారులకు రేషన్‌ పంపిణీలో జాప్యం జరగనివ్వం.
– వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల శాఖ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top