ఈఎస్‌ఆర్‌ నమోదుకు గడువు మూడు రోజులే

Andhra Pradesh Government directives for ESR registration - Sakshi

టీచర్ల సంఘాల వినతితో ఈఎస్‌ఆర్‌ నమోదుకు సర్కారు ఆదేశాలు

ఈనెల తొమ్మిదో తేదీతో ముగియనున్న గడువు

అప్పటిలోగా నమోదు కష్టతరం అంటున్న మునిసిపల్‌ టీచర్ల యూనియన్‌ 

అనేక సంవత్సరాలుగా వీటి నిర్వహణ గాలికి

సాక్షి, అమరావతి: గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మునిసిపల్‌ టీచర్ల సర్వీస్‌ రిజిస్టర్‌ అప్‌డేట్‌కు ఇటీవల మున్సిపల్‌ శాఖ నడుంబిగించింది. మునిసిపల్‌ టీచర్స్‌ యూనియన్‌ నాయకుల వినతి మేరకు సర్వీస్‌ రిజిస్టర్‌ అప్‌డేట్‌ చేయడంతోపాటు, ఎంప్లాయిస్‌ సర్వీస్‌ రిజిస్టర్‌ (ఈఎస్‌ఆర్‌) పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఈ నెల 2న మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఈనెల 9 తేదీలోగా పూర్తిచేయాలని అందులో పేర్కొన్నారు. నిజానికి.. ఉద్యోగం ప్రారంభం నుంచి ఏటా పొందే ఇంక్రిమెంట్లు, పీఆర్‌సీ, పదోన్నతులు, సెలవులు వంటి సమగ్ర సమాచారం పొందుపరిచే అధికారిక పుస్తకమే సర్వీస్‌ రిజిస్టర్‌. దీని స్థానంలో ఈఎస్‌ఆర్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ విధానాన్ని 2019లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా 2,115 మున్సిపల్‌ స్కూల్స్‌లో 13వేల మందికి పైగా టీచర్లు పనిచేస్తున్నారు. అయితే.. చాలా మున్సిపాలిటీల్లో సర్వీస్‌ రిజిస్టర్‌ నిర్వహణను అనేక ఏళ్లుగా గాలికొదిలేశారు. ఉదా.. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 500 మందికి పైగా టీచర్లు పనిచేస్తుండగా వీరి సర్వీస్‌ రిజిస్టర్‌ను గత ఐదేళ్లకు పైగా అప్‌డేట్‌ చేయలేదు. ఫలితంగా ఈ నెల తొమ్మిదో తేదీలోగా సర్వీస్‌ రిజిస్టర్‌ అప్‌డేట్, ఈఎస్‌ఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ అసాధ్యమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. 

డీడీఓ పవర్‌ లేకనే
స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కింద ఉండే జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లో హెడ్‌మాస్టర్‌ డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ ఆఫీసర్‌ (డీడీఓ)గా వ్యవహరిస్తారు. హెడ్‌ మాస్టర్‌ తన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సర్వీస్‌ సంబంధిత విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ సర్వీస్‌ రిజిస్టర్‌ నిర్వహిస్తూ ఉంటారు. అయితే,  మున్సిపల్‌ స్కూల్స్‌లో హెడ్‌మాస్టర్లు డీడీఓలుగా ఉండటంలేదు. మున్సిపాలిటీలో పనిచేసే ఓ అధికారి డీడీఓగా ఉండటం, ఇతనే మున్సిపాలిటీలో పనిచేసే అందరు ఉద్యోగులకు డీడీఓగా వ్యవహరిస్తుంటారు. ఆ అధికారిపై పనిభారం పెరిగి సర్వీస్‌ రిజిస్టర్ల నిర్వహణ సరిగా ఉండటంలేదనే ఆరోపణలున్నాయి. 

హెడ్‌మాస్టర్లను డీడీఓలుగా ఉంచాలి
టీచర్ల సర్వీస్‌ రిజిస్టర్ల నిర్వహణలో ఉన్న సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొన్నేళ్లుగా వీటి నిర్వహణలేదు. తొమ్మిదో తేదీ గడువులోగా ఈఎస్‌ఆర్‌ల నమోదు పూర్తికాదు. కాబట్టి గడువు పెంచి, టీచర్లను భాగస్వాములుగా చేసుకుని నమోదు ప్రక్రియ చేపట్టాలి. హెడ్‌ మాస్టర్లకు డీడీఓ అధికారాలివ్వాలి.
– రామకృష్ణ, మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top