నైపుణ్య పోటీల్లో సత్తా చాటిన ఏపీ

Andhra Pradesh excels in skill competitions of South Indian states - Sakshi

31 విభాగాల్లో 20 అవార్డులు సొంతం  

జనవరిలో బెంగళూరులో జాతీయ స్థాయి నైపుణ్య పోటీలు 

మహారాణిపేట (విశాఖ దక్షిణ): దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ అవార్డులను సొంతం చేసుకుంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో విశాఖలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ నైపుణ్య పోటీలు ఘనంగా ముగిశాయి. ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ముగింపు వేడుకలు జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. మొబైల్‌ రోబోటిక్స్, ఐటీ ఎలక్ట్రానిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, డిజిటల్‌ కన్‌స్ట్రక్షన్‌ వంటి నైపుణ్య విభాగాల్లో రాష్ట్ర యువత పురస్కారాలు దక్కించుకుంది.

2018లో జరిగిన నైపుణ్య పోటీల్లో మన రాష్ట్రానికి 8 అవార్డులు దక్కగా, ఈసారి 20 అవార్డులు వచ్చాయి. అందులో 12 బంగారు, 8 సిల్వర్‌ మెడల్స్‌ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచిన వీరంతా జనవరి 6 నుంచి పదో తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొంటారు. జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు 2022 అక్టోబర్‌లో చైనాలో జరిగే ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణ) చల్లా మధుసూదనరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు మన రాష్ట్రంలోని యువతకు అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. ఈ పోటీల్లో మొత్తం 51 టెక్నికల్‌ ట్రేడ్‌లో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన 124 మందిని నైపుణ్య పోటీల్లో విజేతలుగా జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top