గౌతమ్‌రెడ్డిది అరుదైన వ్యక్తిత్వం

Andhra Pradesh Assembly solid tribute to Mekapati Gautam Reddy - Sakshi

దివంగత మంత్రికి అసెంబ్లీ ఘన నివాళి  

కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సభ 

సంతాప తీర్మానంపై మాట్లాడిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు  

ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సభ్యులు 

దివంగత రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి శాసనసభ ఘన నివాళులు అర్పించింది. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మంగళవారం సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గౌతమ్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సంతాప సూచకంగా సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. గౌతమ్‌రెడ్డి లేకపోవడం శాసనసభకు లోటని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు.     
– సాక్షి, అమరావతి 

గౌతమ్‌లో నిజంగా బుద్ధుని లక్షణాలు
గౌతమ్‌రెడ్డిలో నిజంగా గౌతమ బుద్ధుడి లక్షణాలు ఉన్నాయి. గొప్ప సంస్కారవంతుడు, మంచి విజ్ఞానం ఉన్న వ్యక్తి. ఇన్నేళ్లలో ఆయన ఎవరినీ నొప్పించడం చూడలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఇన్ని మంచి లక్షణాలున్న గౌతమ్‌రెడ్డి చనిపోయారంటే నమ్మలేకపోతున్నాం. ఆయన సీటు వైపు చూసినప్పుడు బాధ కలుగుతోంది. నిండైన విగ్రహం లేకపోవడం సభకు చాలా వెలితిగా ఉంది. పుత్ర వియోగం ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధాకరం. శ్రీకాకుళం జిల్లాలో టెక్స్‌టైల్స్, హ్యాండ్‌లూమ్స్‌ మెగా క్లస్టర్‌ గురించి ఆయన్ను అడిగితే ప్రతిపాదనను కేంద్రానికి పంపి ఒకసారి ఇద్దరం కలిసి ఢిల్లీ వెళదామన్నారు. ఈరోజు ఆ మనిషి లేరు. ఆయన ఆదర్శ జీవనం, హుందాతనం సభకు రోల్‌ మోడల్‌. ఆయన ఆలోచనల్ని ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి.      
    – స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఎంతో సఖ్యతగా ఉండేవారు
గౌతమ్‌రెడ్డి చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కూడా వ్యవహరించేవారు. అందరితో ఎంతో సఖ్యతగా ఉండేవారు. జిల్లా ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అంత గొప్ప లక్షణాలున్న వ్యక్తి చిన్న వయసులోనే మనల్ని వీడిపోవడం దురదృష్టకరం.      
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

ఏనాడూ దర్పం చూపలేదు
సభలో నా పక్కనే గౌతమ్‌రెడ్డి కూర్చునేవారు. ఆయన ఇవాళ లేకపోవడం ఎంతో బాధ కలిగిస్తోంది. ఒకే జిల్లాకు చెందిన వాళ్లం కావడంతో ఆయనతో ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. ఒక జిల్లాకు చెందిన మంత్రులమైనా కూడా మా మధ్య భేదాభిప్రాయాలు, రాజకీయ విబేధాలు ఏ రోజూ చోటు చేసుకోలేదు. సుధీర్ఘ రాజకీయ ప్రస్థానమున్న, సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చానన్న దర్పం ఆయనలో ఏ కోశానా కనబడేదికాదు. దేవుడు మంచి వాళ్లను త్వరగా తీసుకుపోతారంటారు. అందుకే ఆయన ఈ లోకాన్ని వీడారేమో.
    – అనిల్‌కుమార్‌ యాదవ్, జల వనరుల శాఖ మంత్రి

పీడ కలలా ఉంది
గౌతమ్‌రెడ్డి లేరు అన్న విషయాన్ని పీడ కలలాగా భావిస్తున్నాను. మేకపాటి కుటుంబంతో 35 ఏళ్ల అనుబంధం నాకు ఉంది. నేను నెల్లూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కూడా ఉండటంతో ప్రతి రెండు, మూడు రోజులకు ఓసారి గౌతమ్‌ ఫోన్‌ చేసి మాట్లాడేవారు. గౌతమ్‌ రెడ్డి మరణ వార్త విని వాళ్ల ఇంటికి వెళ్లగానే.. నన్ను చూసి ‘నా బంగారం లాంటి కొడుకు లేడయ్యా’ అంటూ ఆయన తల్లి రోదించిన ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. తుపాను సమయంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నపుడు సోమశిల వద్ద వరదల్లో దెబ్బతిన్న దేవాలయాన్ని పునఃనిర్మించాలని గౌతమ్‌ నాతో అన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లాను. దేవాలయం నిర్మాణానికి చర్యలు తీసుకుని ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం.
    – బాలినేని శ్రీనివాసరెడ్డి, అటవీ, విద్యుత్‌ శాఖ మంత్రి

ప్రత్యేక ముద్ర వేశారు
గౌతమ్‌రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధినేత కొన్ని పనులు మాకు అప్పజెప్పినప్పుడు ఇద్దరం కలిసి గంటలు, రోజులు చొప్పున కసరత్తు చేశాం. సీఎం జగన్‌ మొదటి డ్రీమ్‌ కేబినెట్‌లో మంత్రిగా ఆయన తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. రాజకీయాల్లో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వ్యక్తి అనతి కాలంలో మరణించడం బాధాకరం.    
– ఆదిమూలపు సురేశ్, విద్యా శాఖ మంత్రి

కల్లాకపటం లేని మనిషి
గౌతమ్‌రెడ్డి కల్లాకపటం లేని మనిషి. 2009 ఎన్నికల సమయం నుంచి నాకు ఆయనతో సాన్నిహిత్యం ఉంది. 2014 ఎన్నికల్లో కూడా కలిసి పని చేశాం. ఆయన ఏనాడూ వివాదాల జోలికి పోలేదు. అరుదైన వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగిన వ్యక్తి. 
    – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

తోబుట్టువులా చూసేవారు
రెండేళ్లు నేను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఉన్నాను. గౌతమ్‌రెడ్డి నన్ను ఎప్పుడూ తోబుట్టువులా చూసేవారు. గైడ్‌ చేసే వారు. సీఎం జగన్‌ కేబినెట్‌లోని మంత్రులు, నా తోటి ఎమ్మెల్యేలు ఆయన్ను బాహుబలి, ఆరడుగుల బుల్లెట్‌ అని, జిల్లా ప్రజలు నెల్లూరు టైగర్‌ అని పిలిచేవారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ, క్రమ శిక్షణ కలిగిన గౌతమ్‌ అన్న లేరు అంటుంటే నమ్మశక్యం కావడం లేదు.     
– ఆర్‌.కె.రోజా, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

జిల్లా అభివృద్ధిపై చర్చించారు
నెల్లూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని గౌతమ్‌రెడ్డి నిరంతరం పరితపించేవారు. ఈ అంశంపై జనవరి 3, 4 తేదీల్లో కూడా నాతో చర్చించారు. దుబాయ్‌ నుంచి తిరిగి రాగానే జిల్లా ప్రజాప్రతినిధులు సీఎంను కలుద్దాం అన్నారు. ఇంతలోనే ఆయన మరణించడం బాధ కలిగిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ కంపెనీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ఆ పనులు పురోగతిలో ఉండగానే ఆయన ఈ లోకం వీడారు.  
    – ఆనం రామనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

విదేశీ పెట్టుబడులకు ఎనలేని కృషి
రాజకీయాల్లో హుందాగా వ్యవహరించడంలో గౌతమ్‌రెడ్డికి ఎవరూ సాటిరారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో రాష్ట్రాన్ని నంబర్‌–1గా నిలపడం, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన కృషి ఎనలేనిది. 
    – అబ్బయ్య చౌదరి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

కష్టకాలంలో అండగా నిలిచారు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా పార్టీ ఇన్‌చార్జిగా గౌతమ్‌రెడ్డి వ్యవహరించారు. అప్పట్లో నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచారు. పార్టీ క్యాడర్‌లో ధైర్యాన్ని నింపారు.         
    – హఫీజ్‌ ఖాన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

అగాధం లాంటిదే
మంత్రి పదవిని బాధ్యతలను అర్థం చేసుకుని, తనకు కేటాయించిన శాఖల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తి గౌతమ్‌రెడ్డి. ఆయన లేని లోటు పార్టీకి, ప్రభుత్వానికి అగాధం లాంటిదే.  
    – ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

సైనికుడిలా పనిచేశారు
సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయ సాధన కోసం గౌతమ్‌ రెడ్డి సైనికుడిలా పనిచేశారు. తండ్రి వారసత్వంగా గౌతమ్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాలేదు. జగనన్న సైనికుడిగానే వచ్చారు. 
    – కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

జ్ఞాపకాలు అనేకం
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయసాధన కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి గౌతమ్‌రెడ్డి. ఆయన నియోజకవర్గంలో జగన్‌ పర్యటన సమయంలో నన్ను సంప్రదించారు. చాలా గొప్పగా నిర్వహించడానికి నన్ను వెంటబెట్టుకుని వెళ్లారు. వారం రోజులు ఆయనతోనే ఉండి ఆ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేశాం. ఇలాంటి జ్ఞాపకాలు అనేకం ఉన్నాయి.     
– చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

కలా.. నిజమా అనుకున్నా
గౌతమ్‌రెడ్డి మృతి చెందారనే విషయం తెలిశాక.. ఇది కలా నిజమా అనుకున్నా. చాలా బాధపడ్డాం. విధేయత, వినయం కలిగిన మంచి వ్యక్తి. ఆయన అలంకరించిన ఉన్నత పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి. కొప్పర్తి పారిశ్రామికవాడని గొప్ప విజన్‌గా ఆయన చెప్పేవారు. 
    – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వే కోడూరు

పెద్దలను గౌరవించేవారు
గౌతమ్‌రెడ్డి ఎంతో సంస్కారవంతుడు. పెద్దలను ఎంతో గౌరవించేవారు. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా.    
– వరప్రసాద్, ఎమ్మెల్యే, గూడూరు

మా కుటుంబానికి పెద్దబ్బాయి
మా కుటుంబానికి పెద్దబ్బాయి గౌతమ్‌రెడ్డి. ఇద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్లం. మా అబ్బాయి ఏం చెబితే అది కుటుంబంలో ఆచరించేవాళ్లం. మేం వైఎస్సార్‌ కుటుంబానికి భక్తులం. గౌతమ్‌ కూడా అంతే. సీఎంకు తోడు నీడగా ఉండేవాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే అలాగే బాబూ అని చేశాను. మా అబ్బాయి సంతాప సభ అసెంబ్లీలో జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు.  
    – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి

చిన్న వయసులో మరణించడం బాధాకరం
చిన్న వయసులోనే గౌతమ్‌ రెడ్డి మరణించడం చాలా బాధాకరం. మరణ వార్త విన్నవెంటనే మా అధినేత చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మా పార్టీ దేవుడిని ప్రార్థిస్తోంది.     
– ఏలూరి సాంబశివరావు, టీడీపీ ఎమ్మెల్యే 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top