పెళ్లి ఆగిపోయే పరిస్థితి.. ‘ఖాకీ’ సాయంతో

Anantapur Puttaparthi Police Help Bride Family To Get Married - Sakshi

అనంతపురం : భారీ వర్షాలతో జిల్లాలో పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో ఆదివారం హిందూపురంలో జరగాల్సిన ఓ అమ్మాయి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించగా...వారు ఊరు దాటించి పెద్దసాయం చేశారు. వివరాల్లోకి వెళితే... బుక్కపట్నంకు చెందిన గోపి కుమార్తె వైష్ణవికి హిందూపురంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 21వ తేదీన హిందూపురంలోనే వివాహం చేసేందుకు నిర్ణయించారు. బంధువులందరికీ పత్రికలు పంచారు. కల్యాణ వేదిక, అలంకరణ, విందుకోసం అడ్వాన్స్‌కూడా ఇచ్చేశారు. 

అయితే భారీ వర్షాలతో పుట్టపర్తి, కొత్తచెరువు మార్గాల్లో వరదనీరు ప్రవహిస్తుండగా...బుక్కపట్నం నుంచి ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గోపి స్థానిక ఎస్‌ఐ నరసింహుడిని సంప్రదించి తన సమస్య వివరించారు. దీంతో ఎస్‌ఐ గోపి స్పందించి మత్స్యకారుల తెప్పలను తెప్పించి పెళ్లివారిని అందులో ఎక్కించుకుని 3 కి.మీ. మేర బుక్కపట్నం చెరువు మార్గంలో కొత్తచెరువు ఒడ్డుకు క్షేమంగా చేర్చారు. 

దీంతో వధువు తండ్రి గోపి ఎస్‌ఐకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బుక్కపట్నానికే చెందిన రూపా వివాహం సైతం ఆదివారమే మరో ప్రాంతంలో జరగాల్సి ఉండటంతో ఆమెను, కుటుంబీకులను కొత్తచెరువు వరకూ తెప్పలో తరలించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top