కరోనా బూచి.. డబ్బు దోచి! 

Ambulance Staff Collect Money From Corona Patient Over Deceased - Sakshi

అంబులెన్స్‌ సిబ్బంది దారుణం 

కరోనాతో చనిపోయాడని మభ్యపెట్టి.. 

అంత్యక్రియల పేరుతో రూ.85వేలు వసూలు 

డెత్‌ సర్టిఫికెట్‌తో మోసం వెలుగులోకి.. 

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌): కరోనా సమయంలో రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు బరితెగిస్తున్నారు. ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులను మభ్యపెట్టి, అంత్యక్రియలకు అంబులెన్స్‌ నిర్వాహకులు రూ.85 వేలు వసూలు చేశారు. డెత్‌ సర్టిఫికెట్‌లో కరోనాతో చనిపోలేదని తెలుసుకుని అంబులెన్స్‌ డ్రైవర్, సిబ్బంది చేతిలో మోసపోయామని నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని బాధితులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మరొకరు మోసపోవద్దని కోరారు.    కర్నూలు నగరంలోని బి.క్యాంపునకు చెందిన కరణం సాయినాథరావు(67) ఈ నెల 14న తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. అతన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. (8,827 మంది డిశ్చార్జ్‌)

పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే సాయినాథరావు కరోనాతో చనిపోయాడని బాధితులకు అంబులెన్స్‌ డ్రైవర్, సిబ్బంది చెప్పారు. మృతదేహాన్ని తామే అంత్యక్రియలకు తీసుకెళ్లాల్సి ఉంటుందని, వైరస్‌ వ్యాప్తి చెందకముందే తరలించాలని తొందరపెట్టారు. నిరక్షరాస్యులైన మృతుని భార్య.. విదేశాల్లో ఉన్న కుమారునికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటున్న కుమారుడు క్రాంతి కిరణ్‌ అక్కడి నుంచే ఫోన్‌లో అంబులెన్స్‌ సిబ్బందితో మాట్లాడారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.85 వేలకు ఒప్పందం చేసుకుని, ఫోన్‌ పే ద్వారా సురేష్‌బాబు ఖాతాకు జమ చేయగా, తన తల్లి రూ.35 వేలు నగదు చేతికి ఇచ్చింది. (అత్యధికంగా 69,878 పాజిటివ్‌, 945 మరణాలు)

డెత్‌ సర్టిఫికెట్‌తో వెలుగులోకి.. 
సాయినాథ్‌రావు మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబసభ్యులు గురువారం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ చూసి షాక్‌ తిన్నారు. సాయినాథ్‌రావు కరోనాతో చనిపోలేదని, సీఆర్‌ఎఫ్‌(క్రానిక్‌ రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌ లేదా క్రానిక్‌ రీనల్‌ ఫెయి ల్యూర్‌)తో చనిపోయాడని డ్యూటీ డాక్టర్‌ రేవతి పేరుతో ధ్రువపత్రం అందించారు. దీనిని వాట్సాప్‌ లో విదేశాల్లోని కుమారుడు క్రాంతి కిరణ్‌కు పంపించారు.జరిగిన మోసాన్ని తెలుసుకున్న అతను..విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top