సాక్షి, హైదరాబాద్: నేడు శారద పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై ఉండనుంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది.
దీంతో, నేటి రాత్రి నుంచే అన్ని దేవాలయాల తలుపులను మూసివేస్తారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులను 8 గంటల పాటు మూసి ఉంచనున్నారు. ఇక, ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన చివరి సూర్యగ్రహణం ఏర్పడగా ఇప్పుడు అక్టోబర్ నెలలో 28వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడుతోంది.
చంద్రగ్రహణం కారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేయనున్నారు. రేపు తెల్లవారుజామున 3:15కు తిరిగి శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 13 గంటలపాటు భక్తులకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలోనే నేడు సహస్ర దీపాలంకారణ సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. కాగా, సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,404. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,659. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్లుగా ఉంది.
తిరుమలలో ఇలా..
ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత
గ్రహణం కారణంగా నేడు రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత
తిరిగి రేపు తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. 
అన్న ప్రసాద కేంద్రం కూడా మూసివేత.
విజయవాడలో ఇలా...
పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా దుర్గగుడి మూసివేత 
నేటి సాయంత్రం 6:30 గంటలకు దుర్గగుడితో పాటు ఉపాలయాల కవాట బంధనం(తలుపులు మూసివేయబడును)
గ్రహణ మోక్షకాలం అనంతరం రేపు  తెల్లవారు జామున 3 గంటలకు తలుపులు తెరుస్తారు
స్నపనాభిషేకాల అనంతరం రేపు ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం
తెలంగాణలో ఇలా.. 
చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రధాన ఆలయాలతో పాటు, అనుబంధ ఆలయాల మూసివేత
ఈరోజు సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి రేపు ఉదయం 3 గంటల 45 నిమిషాల వరకూ ఆలయాల మూసివేత
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన ఆలయాలైన వేములవాడ రాజన్న, ధర్మపురి నర్సన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను మూసివేస్తున్నట్టు అధికారుల ప్రకటన
రేపు ఉదయం 3 గంటల 45 నిమిషాలకు సంప్రోక్షణతో ప్రాత:కాల పూజ చేసి తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు.
పూరీ క్షేత్రంలో భిన్నంగా..
గ్రహణ కాలం ముందుగా దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో దేవతారాధన, పూజలు జరగవు. ఆలయాలు తలుపులు మూసేస్తారు. దీనికి భిన్నం పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ సన్నిధి రాత్రంతా తెరిచే ఉంటుంది. స్వామివారికి ప్రత్యేక సేవలు జరుగుతాయి. భక్తులు ఆలయంలో పురుషోత్తమునికి మౌన ప్రార్థనలు చేస్తారు. గ్రహణం వీడిన తర్వాత ముగ్గురు మూర్తులకు మహా స్నానం, ఆలయ సంప్రోక్షణ చేస్తారు. అనంతరం మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ తదితర సేవలు జరుగుతాయి. 
►అలంపూర్‌లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అధికారులు మూసివేయనున్నారు. 
►చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆలయాలు మూసివేత
►తిరిగి రేపు ఉదయం 5:30 గంటలకు ఆలయ శుద్ధి, మహా సంప్రోక్షణ అనంతరం ఉదయం 9 గంటలకు మహా మంగళ హారతితో భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి, అమ్మవార్లు.
►నేడు చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సత్యదేవుని ఆలయం మూసివేత.
►తిరిగి రేపు ఉదయం 7.30 గంటలకు ఆలయాన్ని తెరువనున్నారు.
►అనంతరం స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభం

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
