Visakhapatnam decked up to host G20 Summit - Sakshi
Sakshi News home page

విశాఖలో జీ–20 సదస్సుకు సర్వ సన్నద్ధం

Mar 28 2023 4:36 AM | Updated on Mar 28 2023 10:38 AM

All preparations done for the G 20 summit - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ మహా నగరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను (జీఐఎస్‌) ఘనంగా నిర్వహించి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించగా, తాజాగా.. మంగళవారం నుంచి జీ–20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) సమావేశాలు జరగనున్నాయి.

ఈ సదస్సు వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో 28, 29, 30, 31 తేదీల్లో విశాఖలో జరగనుంది. నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్‌ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. వీరికి అవసరమైన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు వంటివి అధికారులు పూర్తిచేశారు. అతిథులను స్వాగతించడానికి ప్రత్యేక సాంస్కృతిక బృందాలను సిద్ధంచేశారు.

పూణే, కడియంల నుంచి తెచ్చిన పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
విద్యుత్‌ స్తంభాలకు విద్యుద్దీపాలను అలంకరించారు. ఇలా.. విశాఖ నగరం మునుపెన్నడూ లేని రీతిలో ఎటు చూసినా ఎంతో సుందరంగా కనిపిస్తోంది. ఇక జీ–20 సదస్సుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్‌ వరకు వైజాగ్‌ కార్నివాల్, ఆర్కే బీచ్‌ నుంచి 3కే, 5కే, 10 మారథాన్, పారా మోటార్‌ ఎయిర్‌ సఫారీ కూడా నిర్వహించారు. గత కొన్నిరోజులుగా మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్‌ తదితరులు ఈ సదస్సు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

2,500 మందితో భద్రతా ఏర్పాట్లు
జీ–20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బందోబస్తుకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లుచేశారు.

జీ–20 దేశాలివీ..
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా,ఫ్రాన్స్, జర్మనీ, భారత్,ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌.

నేడు సదస్సు ప్రారంభం.. హాజరుకానున్న సీఎం జగన్‌
జీ–20 సదస్సు తొలిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరవుతారు. సదస్సులోని ప్రతినిధు­లతో ముఖాముఖి మాట్లాడి అనంతరం గాలా డిన్నర్‌లో పాల్గొంటారు. రాత్రికి ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. మరోవైపు.. జీ–20 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రాష్ట్ర సమాచారాన్ని అందజేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తారు. ఈ సదస్సు ద్వారా విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు.  

రూ.157 కోట్లతో నగర సుందరీకరణ
జి–20 సమావేశాలు పురస్కరించుకుని రూ.157 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన నగరం సర్వాంగ సుందరంగా తయారైంది. నగరంలో ఏ మూల చూసినా విద్యుద్దీపాలతో ధగధగలాడుతోంది. విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేశారు. రహదారులన్నీ మిలమిల మెరిసిపోతున్నాయి.

46 కి.మీల మేర రోడ్డు పనులు, 24 కి.మీల మేర పెయింటింగు పనులు, 10 కి.మీల మేర ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టారు.
రూ.2.39 కోట్లతో సీతకొండపై బీచ్‌ వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌ను ఆధునీకరించారు. ఐ లవ్‌ వైజాగ్‌ సెల్ఫీ పాయింట్, సోలార్‌ ట్రీ ఏర్పాటుచేశారు.
సాగర్‌నగర్, గుడ్లవానిపాలెం, జోడుగుళ్లపాలెం బీచ్‌లను అభివృద్ధి చేశారు. రూ.1.31 కోట్లతో కైలాసగిరి రోప్‌వే నుంచి తిమ్మాపురం వరకు 11 కి.మీల మేర ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు చేసి టెర్రాకోట్‌ వేశారు.
రోడ్ల పక్కన గోడలకు, కల్వర్టులకు విశాఖ, ఏపీ సంస్కృతిని ప్రతిబింబించే అందమైన చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. అందాల కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి.
ఎయిర్‌పోర్టు నుంచి బీచ్‌రోడ్డులో సదస్సు జరిగే రాడిసన్‌ బ్లూ హోటల్‌ వరకు ఇరువైపులా వివిధ రకాలతో వైఎస్సార్‌ జిల్లా మేదర నిపుణులు రూపొందించిన వెదురు ఆకృతులపై పూలమొక్కలను అమర్చారు. రోడ్ల మధ్యనున్న డివైడర్లు పచ్చని మొక్కలతో అలరిస్తున్నాయి.

సదస్సు షెడ్యూలు ఇలా..
♦  28 ఉదయం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో అల్పాహారం తర్వాత ప్రధాన సమావేశం హోటల్‌లోని కన్వెన్షన్‌ హాలులో జరుగుతుంది. సా.3.30 నుంచి 6.30 వరకు మూడు రకాల సమావేశాలు నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 వరకు హోటల్‌ సమీపంలోని బీచ్‌లో గాలా డిన్నర్‌ ఉంటుంది. దీనికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరవుతారు. ముఖ్యమంత్రి ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.
♦  29న హోటల్‌ సమీపంలోని బీచ్‌లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటా­యి. ఆ రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం ఉంటుంది.
30న ఉ.10 నుంచి మ.1.30 గంటల వరకు కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాపు ఉంటుంది. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ముడసర్లోవ, కాపులుప్పాడ ప్రాంతాల్లో విదేశీయులు పర్యటిస్తారు. స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్, మెగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ పనితీరు, జిందాల్‌ కంపెనీ పరిధిలో నిర్వహించే వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎనర్జీ తయారీ యూనిట్‌ పనితీరు గురించి అధికారులు వివరిస్తారు.  
31న దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ కమిషనర్లతో పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సింగపూర్, దక్షిణ కొరియా ప్రతినిధులతో చర్చిస్తారు. జన్‌భాగీదారీ కార్యక్రమం కింద స్థానిక నిపుణులతో వివిధ అంశాలపై చర్చా సమావేశాలు జరుగుతాయి. అనంతరం..
విదేశీ ప్రతినిధులు తిరుగు ప్రయాణమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement