'నులి'పేద్దాం

Albendazole tablets for childrens for prevention of weevils - Sakshi

నులిపురుగుల నివారణకు 1–19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు 

రేపటి వరకూ పంపిణీ 

అంగన్‌వాడీలు, స్కూళ్లు, కాలేజీలు తిరిగి మాత్రలు ఇస్తున్న వైద్య సిబ్బంది 

రాష్ట్ర వ్యాప్తంగా 1.04 కోట్ల మంది పిల్లలకు పంపిణీ 

సాక్షి, అమరావతి: పిల్లలను పట్టి పీడించే అనారోగ్య సమస్యల్లో నులిపురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల పొట్టలో చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను శాసిస్తుంటాయి. రక్తహీనత, పోషకలోపం, పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంటాయి. నులిపురుగుల నివారణలో భాగంగా ఏటా రెండు సార్లు ఆల్బెండజోల్‌ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది తొలి విడత పంపిణీ మార్చి 2న ప్రారంభమైంది. 5వ తేదీ వరకూ కొనసాగనుంది. అంగన్‌వాడీలు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు తిరిగి వైద్య సిబ్బంది ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. 1–19 ఏళ్ల వయసున్న 1,04,93,350 మందికి మాత్రలు అందజేస్తున్నారు. 1–2 ఏళ్ల లోపు చిన్నారులకు ఆల్బెండజోల్‌ 400 ఎంజీ సగం మాత్ర, 3–19 ఏళ్లలోపు వారికి 400 ఎంజీ పూర్తి మాత్ర వేస్తున్నారు.  

అపరిశుభ్రత ప్రధాన కారణం  
పిల్లల్లో నులిపురుగులు సంక్రమించడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. పిల్లల చేతిగోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు, మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. 

నులిపురుగుల ప్రభావం ఇలా.. 
నులిపురుగులు పిల్లల శారీరక, మానసిక పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు అవుతాయి. ఈ సమస్యల కారణంగా పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేరు. ఆల్బెండజోల్‌ మాత్ర వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 

తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాలి 
1.5 కోట్ల ఆల్బెండజోల్‌ మాత్రలను అన్ని జిల్లాలకూ సరఫరా చేశాం. విద్యా సంస్థల వారీగా 19 ఏళ్లలోపు పిల్లల వివరాలను ఫోన్‌ నంబర్లతో సహా సేకరించి, వారికి మాత్రలు అందాయో లేదో ఐవీఆర్‌ఎస్‌ ద్వారా విచారిస్తున్నాం. రాష్ట్రంలోని అందరు పిల్లలకు మాత్రలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలందరూ తప్పనిసరిగా మాత్రలు 
వేసుకోవాలి.  
– శ్రీనివాసరెడ్డి, ఆర్బీఎస్‌కే రాష్ట్ర ప్రత్యేకాధికారి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top