breaking news
Nulipurugula prevention
-
'నులి'పేద్దాం
సాక్షి, అమరావతి: పిల్లలను పట్టి పీడించే అనారోగ్య సమస్యల్లో నులిపురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల పొట్టలో చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను శాసిస్తుంటాయి. రక్తహీనత, పోషకలోపం, పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంటాయి. నులిపురుగుల నివారణలో భాగంగా ఏటా రెండు సార్లు ఆల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది తొలి విడత పంపిణీ మార్చి 2న ప్రారంభమైంది. 5వ తేదీ వరకూ కొనసాగనుంది. అంగన్వాడీలు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు తిరిగి వైద్య సిబ్బంది ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. 1–19 ఏళ్ల వయసున్న 1,04,93,350 మందికి మాత్రలు అందజేస్తున్నారు. 1–2 ఏళ్ల లోపు చిన్నారులకు ఆల్బెండజోల్ 400 ఎంజీ సగం మాత్ర, 3–19 ఏళ్లలోపు వారికి 400 ఎంజీ పూర్తి మాత్ర వేస్తున్నారు. అపరిశుభ్రత ప్రధాన కారణం పిల్లల్లో నులిపురుగులు సంక్రమించడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. పిల్లల చేతిగోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు, మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. నులిపురుగుల ప్రభావం ఇలా.. నులిపురుగులు పిల్లల శారీరక, మానసిక పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు అవుతాయి. ఈ సమస్యల కారణంగా పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేరు. ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాలి 1.5 కోట్ల ఆల్బెండజోల్ మాత్రలను అన్ని జిల్లాలకూ సరఫరా చేశాం. విద్యా సంస్థల వారీగా 19 ఏళ్లలోపు పిల్లల వివరాలను ఫోన్ నంబర్లతో సహా సేకరించి, వారికి మాత్రలు అందాయో లేదో ఐవీఆర్ఎస్ ద్వారా విచారిస్తున్నాం. రాష్ట్రంలోని అందరు పిల్లలకు మాత్రలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలందరూ తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాలి. – శ్రీనివాసరెడ్డి, ఆర్బీఎస్కే రాష్ట్ర ప్రత్యేకాధికారి -
పైలేరియా మందుల పంపిణీని విజయవంతం చేయాలి
జాతీయ ఆరోగ్య మిషన్ రీజినల్ డైరెక్టర్ అనురాధ నర్మెట : ప్రభుత్వం చేపట్టిన పైలేరియా మందుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ మేడోజు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం నులిపురుగుల నివారణ మందుల పంపిణీని ఆమె పరిశీలించారు. తొలుత ఆర్డీ అనురాధ స్థానిక పీహెచ్సీలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోదకాలు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. దోమకాటుతో వచ్చే బోదకాలు నివారణ మాత్రలు ప్రతీ ఒక్కరూ వేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, వరంగల్లో మాత్రమే బోదకాలు వ్యాధి తీవ్రత ఉందని, దీనిపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వరంగల్ జిల్లాలో 17 పీహెచ్సీల పరిధిలో మాత్రమే సమస్య ఉందన్నారు. ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి ఆమె నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ పి.కరుణాకర్రాజు, క్లస్టర్ ఇ¯Œæచార్జి వీరబాబు, ఫాతిమాబేగం, రహమాన్, ఏఎన్ఎంలు సునంద, కరుణ, ఆశకార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.