స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం

Air system formed in southwest bay of bengal is continuing steadily - Sakshi

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, పాడేరు: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఇది తూర్పు ఈశాన్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వాయుగుండం తమిళనాడులోని నాగపట్నానికి తూర్పున 570 కి.మీ.లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది అదే ప్రాంతంలో నెమ్మదిగా పశ్చిమ నైరుతి దిశలో కదులుతూ రానున్న 24 గంటల్లో శ్రీలంక మీదుగా కొమరిన్‌ వైపు వెళుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. 

క్షీణిస్తున్న రాత్రి ఉష్ణోగ్రతలు...
మరోవైపు రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. గురువారం రాత్రి రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

అరకు 4.9 డిగ్రీలు, పాడేరు 5.6 డిగ్రీలు, కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) 11.1డిగ్రీలు, గొలుగొండ (అనకాపల్లి జిల్లా) 12.3 డిగ్రీలు, బెలుగుప్ప (అనంతపురం) 12.3 డిగ్రీలు, పెదతిప్పసముద్రం (అన్నమయ్య) 12.3 డిగ్రీలు, మంత్రాలయం (కర్నూలు) 12.7డిగ్రీలు, రామభద్రాపురం (విజయనగరం) 12.7డిగ్రీలు, సోమల (చిత్తూరు) 13.1డిగ్రీలు, టి.నర్సాపురం (ఏలూరు) 14డిగ్రీలు, మద్దూరు (వైఎస్సార్‌ జిల్లా) 14 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top