ఏఐతో లే‘ఆఫ్‌ సోపాలు’! | AI Effect On Employees | Sakshi
Sakshi News home page

ఏఐతో లే‘ఆఫ్‌ సోపాలు’!

Jul 14 2025 4:54 AM | Updated on Jul 14 2025 4:54 AM

AI Effect On Employees

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కొలువుల కోతే!

ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి

ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తున్న 41శాతం కంపెనీలు

రానున్న ఐదేళ్లలో 9.2 కోట్ల మంది ఉద్యోగాలు హుష్‌!  

కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగులపై ఏఐ ట్రాకింగ్‌ టెక్నాలజీ నిఘా 

అవేర్, వాల్‌మార్ట్, డెల్టా, టి–మొబైల్, చెవ్రాన్, స్టార్‌బక్స్, గూగుల్‌లోనూ నిత్య పర్యవేక్షణ

లక్ష్యాలను చేరుకోలేని సిబ్బందికి నేరుగా ఊస్టింగ్‌ లెటర్లు పంపుతున్న కృత్రిమ మేధ

‘‘రానున్న ఐదేళ్లలో అన్ని ఎంట్రీ లెవల్‌ వైట్‌ కాలర్‌ ఉద్యోగాల్లో సగాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) భర్తీ చేస్తుంది. అంటే సాధారణ ఉద్యోగులు కొలువులు కోల్పోయి రోడ్డున పడతారు. నిరుద్యోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది కనీసం 10 శాతం నుంచి 20 వరకూ ఉండ­వచ్చు.’’ఈ మాటలు చెప్పింది మరె­వరో కాదు ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మాన్‌. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యువ­తరం ఒక్క­సారిగా ఉలిక్కిపడింది.

ప్రస్తు­తం టెక్‌ ప్రపంచంలో ఏఐ మాటే ఎక్కువగా విని­పిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే దిశగా ఏఐ అడుగులు వేస్తోంది. 2029 నాటికి మానవ మేధస్సును కృత్రిమ మేధ అధిగమిస్తుందని ఎలన్‌ మస్క్‌ కూడా వ్యాఖ్యానించడం ఆందోళన కలిగిస్తోంది. ఏఐ సాంకేతికత వల్ల అనూ­హ్య పరిణామాలు చోటు­చేసు­కుంటా­యని,  2030 నాటికి ప్రపంచ వ్యా­ప్త­ంగా దాదాపు 9.2 కోట్ల మంది ఉద్యో­గాలు కోల్పోతారని తాజా అధ్య­­య­నాల సారాంశం. అంతర్జాతీ­యంగా ప­లు కార్పొరేట్‌ సంస్థల్లో ప్రస్తు­తం జరు­గుతున్న పరిణా­మాలు దీనికి ఊత­మి­­స్తు­న్నా­యి. ఈ ఏడాది భారీ సంఖ్యలో టెక్‌ లేఆఫ్స్‌ ఉండబో­తున్నాయని సమాచారం.

వెంటాడే ఏ ‘ఐ’:
ప్రతి సంస్థలోనూ ఉద్యోగుల పనితీరుపై పర్యవేక్షణ సర్వసాధారణం. అయితే కార్యాలయంలో పని గంటలు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రతి ఉద్యోగి కదలికలనూ ఏఐ ట్రాక్‌ చేయడం అనేది ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థల్లో కొత్తగా మొదలైంది. పనితీరు మదింపు తర్వాత సంస్థ లక్ష్యాలను చేరుకోలేని వారికి కృత్రిమ మేధ నేరుగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు (డిస్మస్‌ ఆర్డర్‌) ఆదేశాలను యాజమాన్యంతో సంబంధం లేకుండానే వారి ఈ మెయిల్‌కు పంపిస్తుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.

వాల్‌మార్ట్, డెల్టా, చెవ్రాన్, స్టార్‌బక్స్, అవేర్, టి–మొబైల్‌ వంటి ప్రముఖ సంస్థలూ ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణకు ఏఐని ఉపయోగిస్తున్నాయి. గూగుల్‌ క్లౌడ్‌ హెచ్‌ఆర్‌ బృందం వారి నియామక ప్రక్రియను మార్చడానికి, ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్‌ను వేగవంతం చేయడానికి ఏఐని వాడుతున్నారు. అయితే ఇలాంటి చర్యల వల్ల పనితీరు మెరుగుపడదు సరికదా ఉద్యోగులను మానసికంగా ప్రభావితం చేస్తాయని ‘కార్నెల్‌’ పరిశోధనలో తేలింది.

జూనియర్లకు కష్టకాలం
ఏఐ ట్రాకింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా టెక్, ఇతర ఇండస్ట్రీల్లో వేల సంఖ్యలో జూనియర్‌ స్థాయి ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ప్రముఖ వ్యక్తుల వ్యాఖ్యలు, అధ్యయనాలను బట్టి తెలుస్తోంది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించిన ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్‌ రిపోర్ట్‌ 2025’ సర్వే ప్రకారం, ఏఐ టెక్నాలజీ పెరుగుదల వల్ల ప్రపంచంలోని దాదాపు 41 శాతం కంపెనీలు రానున్న ఐదేళ్లలో తమ ఉద్యోగులను తగ్గించుకోవాలనుకుంటున్నాయి. ఇప్పటికే మెటా, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, బీపీ వంటి కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ నుంచి ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించాయి.

సీఎన్‌ఎన్‌ టెలివిజన్‌లో పనిచేస్తున్న 200 మందిని తొలగించింది. స్టార్‌బక్స్‌ సిబ్బందిని తొలగించింది. ఇంజినీరింగ్, ఉత్పత్తి, కార్యకలాపాలు వంటి విభా­గాలలో స్ట్రైప్‌ 300 మందిని ఇళ్లకు పంపనుంది. యూకే పెట్రో­లియం కంపెనీ బీపీ సుమారుగా 7,700 మంది ఉద్యోగుల్ని, కాంట్రాక్టర్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మెటా కూడా 5శాతం మంది వర్క్‌ఫోర్స్‌ని తగ్గించనుంది. బ్లాక్‌రాక్‌ 200 మందిని వద్దంటోంది.వాషింగ్టన్‌ పోస్ట్‌ 100 మంది ఉద్యో­గు­లకు ఉద్వాసన పలికినట్లు తెలిపింది. ఇవే కాకుండా చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తీసేయనున్నాయి. కంపెనీలు తమ సామ­ర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వైపు వెళ్లడానికి, ఖర్చుల్ని నియంత్రించడానికి  ఉద్యోగుల్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement