ఈనెల 25 నాటికి వాల్‌ పెయింట్లను పూర్తి చేయాలి: మంత్రి సురేష్‌

Adimulapu Suresh Review Meeting On Mana Badi Nadu Nedu Program Key Points - Sakshi

సాక్షి, అమరావతి: పాఠశాలల్లో ఈనెల 25 నాటికి వాల్‌ పెయింట్లను పూర్తి చేయాలి మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయాలన్నారు. ఆయన మనబడి:నాడు-నేడుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. మన బడి నాడు- నేడు’ ఒక మహాయజ్ఞం అని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విభాగం, తల్లిదండ్రులు కమిటీ సమష్టి కృషి వల్లే కార్యక్రమం విజయం వైపు బాటలు వేస్తుందన్నారు. మొదటి దశలో భాగంగా 15,715 పాఠశాలల్లో జరుగుతున్న ‘మనబడి:నాడు-నేడు’ పనులు సంపూర్ణ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో వాల్ పెయింట్ పనులు ఇంకా పూర్తి కాలేదని, వాటిని ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు తెరిచే సమయం తక్కువగా ఉండడంతో త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. వాల్ పెయింట్లలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలని అన్నారు. మన రాష్ట్రంలో చేపడుతున్న ‘మన బడి : నాడు-నేడు’ పనులు చూసి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు పరిశీలించి మెచ్చుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.

టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వాక్సిన్ ప్రక్రియ 
ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో పని చేస్తున్న పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్ విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు సంబంధించి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయించే ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిని ఒక ప్రత్యేక డ్రైవ్ గా చేపట్టి 100 శాతం పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్యాల్లో పని చేస్తున్న 168911 మంది ఉపాధ్యాయుల్లో ఈనెల 10వ తేదీ నాటికి తొలి విడత వ్యాక్సిన్ 81994 (48.5 %) వేయించుకున్నారని తెలిపారు. వీరిలో 45 ఏళ్ల లోపు ఉపాధ్యాయులు 75183 మంది  ఉండగా 35101 మంది తొలి విడత వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపారు. 45 ఏళ్లు పైబడిన వాళ్లు 93728 మంది ఉండగా 46893 తొలి విడత వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపారు. రెండో విడత వ్యాక్సిన్ 57056 (33.8%) మంది వేసుకోగా 45 లోపు వాళ్లు 15367 మంది, 45 ఏళ్లు పైబడినవాళ్లు 41689 మంది ఉన్నారని అన్నారు.  వీరంతా ఈనెల 31 నాటికి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అన్నారు. దీనికి సంబంధించి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్లు (అభివృద్ధి), జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, ఐటిడీఏ పీవోలు, డీఎంహెచ్ఓలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top