Adimulapu Suresh: సమ్మె విరమించండి.. మాట్లాడుకుందాం 

Adimulapu Suresh Comments about Sanitation workers Strike - Sakshi

ప్రజా సేవలకు విఘాతం కలిగించడం సరికాదు  

పట్టణ పారిశుధ్య కార్మిక జేఏసీకి మునిసిపల్‌ శాఖ మంత్రి విజ్ఞప్తి 

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో కార్మికుల మేలుకోరే ప్రభుత్వం ఉందని, ప్రజా సేవలకు విఘాతం కలిగించి మునిసిపల్‌ ఒప్పంద పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడం భావ్యం కాదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ అంశంపై పట్టుబట్టి సమ్మె చేయడం సరికాదని మునిసిపల్‌ ఒప్పంద కార్మికులకు హితవు పలికారు. ధర్నాలు, సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావని, కలిసి చర్చించుకుంటే పరిష్కారమవుతాయన్నారు.

పక్క రాష్ట్రంతో పోలిస్తే పారిశుధ్య ఒప్పంద కార్మికులకు ఏపీలో మెరుగైన వేతనాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సీఎం వైఎస్‌ జగన్‌ కార్మికులకు న్యాయం చేస్తారన్నారు. ప్రస్తుతం కార్మికుల్లో ఏ ఒక్కరికీ రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇస్తున్నట్టు చెప్పారు. కార్మికులకు కావల్సిన అన్ని సౌకర్యాలు, పనిముట్లు కూడా సరిపడినన్ని అందుబాటులో ఉంచామన్నారు. దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పంద కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి రావాలని సూచించారు.

కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజా సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రెగ్యులర్‌ సిబ్బంది విధుల్లో ఉన్నారని, కొందరు కాంట్రాక్ట్‌ సిబ్బంది సైతం సేవలు అందిస్తున్నారని వివరించారు. అవసరమైన యూఎల్‌బీల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. యూఎల్‌బీల్లో సేవలకు వాహనాలు అవసరమైన చోట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు. హోటళ్లు, మార్కెట్ల వద్ద చెత్త ఉండిపోకుండా ఎప్పటికప్పుడు తరలించాలని సీడీఎంఏ ప్రవీణ్‌ కుమార్‌ మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. సమ్మె నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం మంత్రులు ఆదిమూలపు, బొత్స, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. 

సమ్మెను ఉధృతం చేస్తాం: కార్మిక జేఏసీ 
మునిసిపల్‌ కార్మికుల సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు పట్టణ పారిశుధ్య కార్మిక జేఏసీ, సీఐటీయూ నేత కె.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. శుక్రవారం నుంచి మునిసిపల్‌ ఒప్పంద కార్మికులు విద్యుత్‌ నిర్వహణ సేవలను నిలిపివేస్తారని చెప్పారు. ఈ నెల 17 నుంచి అన్ని అత్యవసర విభాగాల్లో పనిచేస్తోన్న మునిసిపల్‌ కార్మికులు విధుల్లో పాల్గొనరాదని కోరారు. గురువారం అన్ని పట్టణాల్లో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు చేయనున్నారని, శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top