పది రెట్లు పెనాల్టీ.. క్రిమినల్‌ కేసులు

Actions against hospitals that charge high fees for Covid treatment - Sakshi

కోవిడ్‌ చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: మానవత్వం మరచి కోవిడ్‌ రోగుల వద్ద అధిక ఫీజులు దండుకునే ప్రైవేటు ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. తీరు మార్చుకోని ప్రైవేటు ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. కోవిడ్‌ చికిత్సలకు, పరీక్షలకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులనే వసూలు చేయాలన్న ఆదేశాలను ఉల్లంఘిస్తూ కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి ఆస్పత్రులకు ఇప్పటివరకు నోటీసులు జారీ చేసి, జరిమానాలను విధిస్తూ వస్తున్నారు. అయితే, తీరు మార్చుకోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులతో దోపిడీని కొనసాగిస్తున్నాయి.

ఈ విషయం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి రావడంతో అలాంటి ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సింఘాల్‌ శుక్రవారం కీలక ఉత్తర్వులిచ్చారు. వీటి ప్రకారం.. తొలి సారి నిబంధనలను ఉల్లంఘించి, ప్రభుత్వం నిర్ధారించిన దానికన్నా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే అలాంటి ఆస్పత్రులకు పది రెట్లు పెనాల్టీ విధిస్తారు. రెండో సారి కూడా అధిక ఫీజుల వసూలుకు పాల్పడితే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, ప్రాసిక్యూట్‌ చేస్తారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు, పోలీసు కమిషనర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు.

ప్రైవేటు ఆస్పత్రులలో ‘ఆక్సిజన్‌’ ఇలా ఉండాలి..
రాష్ట్రంలోనిప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ల సంఖ్య ఆధారంగా ఉండాల్సిన ఆక్సిజన్‌ పరికరాలకు సంబంధించి గత చట్టాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం ఇక నుంచి రాష్ట్రంలో 50 పడకలు దాటిన ఆస్పత్రులలో ఎన్ని పడకలు ఉన్నాయో అన్ని ఆక్సిజన్‌ సిలిండర్లను కలిగి ఉండాలి. 50 లోపు పడకలున్న ఆస్పత్రులు 40 ఆక్సిజన్‌ సిలిండర్లను కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఆస్పత్రిలో పడకల సంఖ్యకు సమానంగా రెగ్యులేటర్‌తో కూడిన ఆక్సిజన్‌ మాస్క్‌లు ఉండాలి. 100కు పైగా పడకలున్న ఆస్పత్రి 1,000 ఎల్‌పీఎం పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్, 50 నుంచి 100 పడకలలోపు ఆస్పత్రి 500 ఎల్‌పీఎం పీఎస్‌ఏ ప్లాంట్‌ను కలిగి ఉండాలి. ప్రతి ఆస్పత్రిలో పడకల సంఖ్యకు సమానంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ను కలిగి ఉండాలని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top