మరింత పర్యావరణహితంగా అచ్యుతాపురం సెజ్‌  | Sakshi
Sakshi News home page

మరింత పర్యావరణహితంగా అచ్యుతాపురం సెజ్‌ 

Published Sun, Nov 19 2023 5:37 AM

Achyutapuram SEZ is more eco friendly - Sakshi

సాక్షి, అమరావతి: ఫార్మా, రసాయనాలు తదితర రెడ్‌ కేటగిరీ యూనిట్లకు ప్రధాన ఆకర్షణగా ఉన్న అచ్యుతాపురం సెజ్‌ను మరింత పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద 5,595.47 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఏపీ సెజ్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫార్మా, రసాయన యూనిట్లు ఏర్పాటు కావడమే కాకుండా.. మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండడంతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రసాయన వ్యర్థాలను శుద్ధి చేసే మౌలికవసతులను భారీస్థాయిలో కల్పించాలని నిర్ణయించింది.

ఇందుకోసం సుమారు రూ.540 కోట్లతో డిజైన్‌ బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో (డీబీఎఫ్‌వోటీ) కామన్‌ ఇఫ్లుయంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌తో (సీఈటీపీ) పాటు వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తున్నది. ప్రస్తుతం అచ్యుతాపురం వద్ద 825కేఎల్‌డీ సామర్థ్యంతో సీఈటీపీని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ఉన్న పరిశ్రమలకు పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఇందుకోసం కొత్తగా 5 ఎంఎల్‌డీ సీఈటీపీని ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రస్తుతం ఉన్న 850 కేఎల్‌డీని 2000 కేఎల్‌డీ సామర్థ్యానికి చేరేలా ఆధునికీకరించాలని నిర్ణయించారు.

సీఈటీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిలో కనీసం 50 శాతం పరిశ్రమలు తిరిగి కొనుగోలు చేసి వినియోగించుకోవాలని కంపెనీలను కోరుతున్నది. దీంతోపాటు 10 ఎంఎల్‌డీ కెపాసీటీతో నీటి శుద్ధి యూనిట్‌ను,  ఘన వ్యర్థాలను నిర్వహించే యాజమాన్య వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. డీబీఎఫ్‌వోటీ విధానంలో రూ.540 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ యూనిట్‌ను 33 ఏళ్లపాటు లీజు విధానంలో నిర్వహించడానికి ప్రవేటు సంస్థకు పారదర్శక విధానంలో అప్పగించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఈ బిడ్లను న్యాయపరిశీలన కోసం జ్యుడీషియల్‌ ప్రివ్యూకు ఏపీఐఐసీ పంపించింది. అచ్యుతాపురం సెజ్‌తో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు పారిశ్రామిక పార్కులు విశాఖ, విజయవాడ, గుంటూరు ఆటోనగర్‌లు, ఒంగోలు గ్రోత్‌ సెంటర్లలోమౌలికవసతుల అభివృద్ధికి ఏపీఐఐసీ ప్రాధాన్యత ఇస్తున్నది. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఆధునికీకరణలో భాగంగా రెండో దశ పనుల కింద ఏపీసెజ్‌లో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను ఏపీఐఐసీ చేపట్టింది.

Advertisement
 
Advertisement