
సాధారణ చార్జీలే వర్తింపు
సంక్రాంతి పండుగ సందర్భంగా 7,200 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వాటిలో సంక్రాంతి పండుగకు ముందు ఈ నెల 8 నుంచి 13 వరకు 3,900 బస్సు సర్వీసులు, పండుగ తర్వాత ఈ నెల 16 నుంచి 20 వరకు 3,300 బస్సు సర్వీసులను నడపనుంది. రోజువారి తిరిగే బస్సు సర్వీసులకు అదనంగా ఈ సంక్రాంతి స్పెషల్ బస్సులను నడుపుతారు.
పండుగకు ముందు 3,900 ప్రత్యేక బస్సు సర్వీసుల్లో అత్యధికంగా 2,153 సర్వీసులు హైదరాబాద్ నుంచే నడుస్తాయి. బెంగళూరు నుంచి 375, చెన్నై నుంచి 42, విజయవాడ నుంచి 300, విశాఖ నుంచి 250, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 50, ఇతర ముఖ్య ప్రాంతాల నుంచి 500 బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసినట్టుగానే సాధారణ చార్జీలతోనే ఈ స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒకేసారి రానూపోనూ టికెట్ కొనుగోలు చేసినవారికి 10 శాతం రాయితీ ప్రకటించినట్టు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు 149, 0866–2570005 కాల్ సెంటర్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. – సాక్షి, అమరావతి