తొలిదశలో  66 స్కిల్‌ హబ్స్‌ ప్రారంభం

66 skill hubs will be started In the first phase - Sakshi

ఇంటర్, అంతకంటే తక్కువ చదువు ఉన్న వారికి నైపుణ్యశిక్షణ 

నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175, అదనంగా రెండు హబ్స్‌  

తొలి హబ్‌ను కర్నూలు జిల్లా డోన్‌లో ప్రారంభించిన మంత్రి బుగ్గన 

విజయవాడలో మరో హబ్‌ను ప్రారంభించిన చల్లా మధుసూదన్, అజయ్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంలో భాగంగా కీలక అడుగు ముందుకు పడింది. ఇంటర్మీడియట్, అంతకంటే తక్కువ చదువు ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి వంతున ఏర్పాటు చేస్తున్న 175 స్కిల్‌ హబ్స్, అదనంగా మరో రెండు హబ్స్‌ (మొత్తం 177)లో తొలిదశ కింద 66 స్కిల్‌ హబ్స్‌ గురువారం ప్రారంభమయ్యాయి.

కర్నూలు జిల్లా డోన్‌లో ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌ను రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)ఎండీ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి రెండు స్కిల్‌ యూనివర్సిటీలు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్‌ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఇందులో భాగంగా 66 స్కిల్‌ హబ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలోనే మిగిలిన 111 హబ్స్‌ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించే విధంగా కోర్సులను తీర్చిదిద్దినట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయా సంస్థలే ఉపాధి కల్పిస్తాయన్నారు.

విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (స్కిల్‌ డెవలప్‌మెంట్‌) చల్లా మధుసూదన్‌రెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ కాలేజీలో ఈ స్కిల్‌ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top