రబీకి 5 లక్షల లీటర్ల నానో యూరియా నిల్వలు 

5 lakh liters of Nano Urea stock for Rabi Season - Sakshi

2021–22 సీజన్‌లో 2.90 లక్షల లీటర్ల అమ్మకాలు 

గడిచిన ఖరీఫ్‌లో 1.25 లక్షల లీటర్ల విక్రయం 

ఆర్బీకేల ద్వారా కనీసం 25 శాతం అమ్మకాలకు ఏర్పాట్లు 

సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగం పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో ఈ నానో యూరియాను మార్కెట్‌లోకి  తెచ్చింది. 500 మిల్లీలీటర్ల సీసాలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్‌లో రూ.266.50 ఉండగా, నానో యూరియా సీసా రూ.240కే అందుబాటులోకి తెచ్చారు.

గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20 వేల మంది రైతులు 34,128 సీసాల (17 వేల లీటర్ల) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో లక్షమందికి పైగా రైతులు 5,46,012 సీసాలు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2 లక్షల లీటర్లు (4 లక్షల సీసాలు) అందుబాటులో ఉంచగా 1.25 లక్షల లీటర్లు (2.50 లక్షల సీసాలు) అమ్ముడయ్యాయి.

సకాలంలో వర్షాలు పడడం, పూర్తిస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, తెగుళ్ల ఉద్ధృతి తక్కువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో యూరియా నిల్వలను డిమాండ్‌కు తగినట్టుగా అందుబాటులో ఉంచడం వంటి కారణాల వల్ల ఆశించిన స్థాయిలో నానో యూరియా అమ్మకాలు జరగలేదని అంచనా వేస్తున్నారు. ఎరువుల వినియోగం ఎక్కువగా ఉండే ప్రస్తుత రబీ సీజన్‌లో కనీసం 5 లక్షల లీటర్ల (10 లక్షల సీసాల) నానో యూరియాను అందుబాటులో ఉంచారు.

డిమాండ్‌ను బట్టి వీటిలో కనీసం 25 శాతానికి తక్కువ కాకుండా ఆర్బీకేల ద్వారా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నానో యూరియా వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో పాటు పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్‌ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో ట్రయల్‌రన్‌లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్‌–2023 సీజన్‌ నుంచి మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సమృద్ధిగా నానో యూరియా నిల్వలు 
నానానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. గతేడాది ఖరీఫ్‌లో 17 వేల లీటర్ల విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏకంగా 1.25 లక్షల లీటర్ల విక్రయాలు జరిగాయి. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రబీ సీజన్‌ కోసం 5 లక్షల లీటర్ల నానో యూరియా బాటిల్స్‌ను అందుబాటులో ఉంచాం. ఇంకా అవసరమైతే పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది.     
– టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్‌ మార్కెటింగ్‌ మేనేజర్, ఇఫ్కో   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top