కుళాయి కనెక్షన్లకు రూ. 4,800 కోట్లు | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లకు రూ. 4,800 కోట్లు

Published Tue, Oct 6 2020 5:45 AM

4800 crores for Tap connections from house to house in villages - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల తరహాలో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే నిమిత్తం నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. రూ. 4,800.59 కోట్ల విడుదలకు అనుమతి తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 91,40,605 ఇళ్లు ఉండగా అందులో 33,88,160 ఇళ్లకు ఇప్పటికే కుళాయి కనెక్షన్లు ఉన్నట్టు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. మిగిలిన 57,52,445 ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు రూ.10,975 కోట్లతో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జలజీవన మిషన్‌ పథకంలో భాగంగా 50% నిధులను కేంద్రం రాష్ట్రానికి ఇస్తుంది.

ఈ పథకం తొలి దశలో రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్ల ఏర్పాటుకు రూ.4,800.59 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపగా, అందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజూ 43.5 లీటర్ల నుంచి 55 లీటర్ల మధ్య వినియోగానికి వీలుగా మంచినీటి పథకాలు నిర్మితమైన చోట ఈ తొలి దశలో కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి రోజూ 43.5 లీటర్ల కంటే తక్కువ పరిమాణంలో నీటి సరఫరా ఉన్న చోట, ఆయా గ్రామాల్లోనూ మంచినీటి పథకాల సామర్థ్యం పెంచి రెండో దశలో ఆ గ్రామాల పరిధిలో ఉన్న మిగిలిన 25.52 లక్షల ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.    

Advertisement
Advertisement