పాడిరైతులకు 45 సీహెచ్‌సీలు

45 CHCs for paddy farmers - Sakshi

పశుసంవర్ధకశాఖ డివిజన్లలో ఒక్కొక్కటి ఏర్పాటు

పాడి రైతులకు అద్దె ప్రాతిపదికన యంత్రాలు

ఇప్పటికే 39 డివిజన్లలో జేఎల్‌జీ గ్రూపుల ఎంపిక

ఒక్కో గ్రూపునకు రు.14.70 లక్షల విలువైన యంత్రాలు

మేలో ప్రారంభించేందుకు అధికారుల కసరత్తు

సాక్షి, అమరావతి: పాడిరైతులకు అద్దె ప్రాతిపదికన ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం పశుసంవర్ధకశాఖ డివిజన్‌స్థాయిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌ (యంత్ర సేవాకేంద్రాలు–సీహెచ్‌సీలు) ఏర్పాటు చేస్తోంది. ఈ నెలాఖరులోగా అర్హతగల జాయింట్‌ లయబుల్‌ గ్రూపు (జేఎల్‌జీ)లకు రుణాలు మంజూరు చేసి మే మొదటి వారంలో వీటిని ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 కోట్ల మేకలు, గొర్రెలు ఉన్నాయి. వీటికి నాణ్యమైన మేతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తోంది. పశుగ్రాసానికి అవసరమైన యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 45 పశుసంవర్ధక శాఖ డివిజన్లలో సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. నలుగురికి తక్కువ కాకుండా పాడి రైతులతో ఏర్పాటైన జేఎల్‌జీ గ్రూపుల్లో అర్హత ఉన్న గ్రూపుల ఎంపిక 39 డివిజన్లలో పూర్తయింది. ఈ కేంద్రాలను క్రమంగా ఏరియా వెటర్నరీ ఆస్పత్రి, డిస్పెన్సరీ స్థాయికి విస్తరిస్తారు.

40 శాతం సబ్సిడీ
ఈ కేంద్రాలకు రూ.14.70 లక్షల విలువైన 8 రకాల యంత్రపరికరాలను సమకూర్చనున్నారు. వీటిలో గడ్డిని ముక్కలు చేసే యంత్రాలు, కట్టలు కట్టే యంత్రాలు తదితరాలున్నాయి. కంకిపాడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో డెమో ప్రదర్శనకు ఉంచిన ఈ యంత్రాలను పరిశీలించి గ్రూపు సభ్యులు తమకు అవసరమైనవే కొనుక్కునే వెసులుబాటు కల్పించారు. ఈ మొత్తంలో 10 శాతం జేఎల్‌జీ భరించాలి. 40 శాతం సబ్సిడీ రూపంలో రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగిలిన 50 శాతం మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతి యంత్ర పరికరానికి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. యూనిట్‌ గ్రౌండ్‌ కాగానే సబ్సిడీ విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఆర్‌కేవీవై నిధుల నుంచి రూ.2.65 కోట్లు కేటాయించారు. నెలాఖరులోగా జేఎల్‌జీ గ్రూపుల ఎంపిక, రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిచేసి వచ్చేనెలలో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ డీడీ అమరేంద్రకుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top