
స్వాధీనం చేసుకున్న ఆధారాల ప్రకారం అంచనా వేస్తున్నాం
గొర్రెలు కొనకుండానే.. లబ్ధిదారులు లేకుండానే నిధులు మళ్లించారు
200 మ్యూల్ బ్యాంకు ఖాతాల్లోకి గొర్రెల కొనుగోలు సొమ్ము పంపారు
ఈ ఖాతాలకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో లింక్‌లు గుర్తించాం
నాటి మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో సోదాల్లో కీలక పత్రాలు
వివరాలు వెల్లడించిన ఈడీ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే గోల్‌మాల్ జరిగినట్టు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం 200లకు పైగా మ్యూల్, డమ్మీ బ్యాంక్ అకౌంట్లతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లు కలిసి సర్కార్ ఖజానాకు గండి కొట్టినట్టు ఈడీ వెల్లడించింది.
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఎనిమిది ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా ఉన్న జి.కల్యాణ్‌కుమార్, కొందరు వినియోగదా రులు, మరో మధ్యవర్తి ఇంట్లో ఈ సోదాలు చేసినట్టు పేర్కొన్నారు.
సోదాల్లో భాగంగా 200 డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్ బుక్స్, డెబిట్ కార్డులు, 31 మొబైల్ ఫోన్లు, 20కి పైగా సిమ్ కార్డులను స్వాధీనంచేసు కున్నట్టు తెలిపారు. ఈ అకౌంట్ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు జరి గిన లావాదేవీల లింకులను కూడా ఈడీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీ పథ కంలో కొల్లగొట్టిన కోట్ల రూపాయలను దారి మళ్లించేందుకు బెట్టింగ్ యాప్స్‌ను ఉప యోగించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది.
రూ.2.1 కోట్లతో మొదలై.. రూ.వందల కోట్లకు
గొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం (షీప్ రియరింగ్ డెవలప్‌మెంట్ స్కీం–ఎస్‌ఆర్‌డీఎస్) కేసు ఆది నుంచి కీలక మలుపులు తిరుగుతోంది. తమ వద్ద కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్లకు సంబంధించి రూ.2.1 కోట్ల డబ్బు తమకు ఇవ్వకుండా పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు అక్రమంగా ఇతర అకౌంట్లకు మళ్లించారని కొందరు గొర్రెల విక్రేతలు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా ఉన్న జి.కల్యాణ్‌కుమార్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని కొన్ని రికార్డులను ధ్వంసం చేసి తీసుకెళ్లాడు. ఈ రెండు కేసుల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. కల్యాణ్‌కుమార్ సహా ఫిష్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ మాజీ సీఈఓ రాంచందర్‌నాయక్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్‌రావు, బ్రోకర్లు సహా మొత్తం17 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది.
ఏసీబీ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్–2002) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కుంభకోణంలో తొలుత రూ.2.1 కోట్ల మేర అవినీతి బహిర్గతమైంది. ఆ తర్వాత కాగ్ ఇచ్చిన నివేదికతో రూ.253.93 కోట్లకు ఈ కుంభకోణం చేరింది. తాజాగా ఈడీ అధికారుల సోదాల్లో లభించిన ఆధారాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో కలిపి మొత్తం రూ.వెయ్యికోట్లకుపైనే అవినీతి జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.
గొర్రెల పంపిణీ చేయకుండానే..నిధులు పంచుకుతిన్నారు
గొర్రెల పంపిణీ పథకంలో ‘నీకిది నాకది’(కిక్‌బ్యాక్) తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ప్యాసింజర్ వాహనాలు, నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు సహా నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు, గొర్రెల యూనిట్లకు డూప్లికేట్ ట్యాగ్‌లు, మృతి చెందిన వారి పేర్లతో యూనిట్లు కేటాయించడం వంటి అక్రమాలను గుర్తించింది.
గొర్రెల స్కీమ్ నిధులు డిపాజిట్ అయిన లబ్ధిదారుల్లో చాలామంది ఈ పథకం ప్రారంభానికి ముందు గొర్రెల వ్యాపారంలో లేరని ఈడీ అధికారులు నిర్ధారించారు. ఎటువంటి కొనుగోలు, అమ్మకాలు జరగలేదని గుర్తించారు. కేవలం కాగితాలపైనే గొర్రెల కొనుగోలు, నకిలీ వాహనాలు, లబ్ధిదారుల పేర్లతో ప్రభుత్వ నిధులను నకిలీ సరఫరాదారుల ఖాతాల్లోకి మళ్లించారని తేల్చారు.
నకిలీ సరఫరాదారులకు చెల్లింపులు, గొర్రెలను మళ్లీమళ్లీ చూపించి ప్రభుత్వ నిధులను కొల్లగొట్టి భారీ అక్రమాలకు తెర తీసినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. లబ్ధిదారుల వివరాలు సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా వాహనాల బిల్లు, చెల్లింపుల రికార్డులు, ఇన్‌వాయిస్‌లు సరిగ్గా లేని రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది.
తాజా సోదాల్లో కీలక ఆధారాలు
కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని జి.కల్యాణ్‌కుమార్ ఇంటితోపాటు రాంచందర్‌నాయక్, రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్‌రావు, లోలోనా ది లైవ్ కాంట్రాక్ట్ సంస్థ యజమానులు మొయిద్దీన్, ఇక్రముద్దీన్ ఇళ్లు, ఆఫీసులు సహా మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన కల్యాణ్‌కుమార్ ఇంట్లో పలు కీలక ఆధారాలు ఈడీ అధికారులు గుర్తించారు.
డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్‌బుక్స్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధ, గురువారాల్లో కల్యాణ్‌కుమార్‌తోపాటు మరో ఇద్దరిని బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు.. వారిని వేర్వేరుగా విచారించారు. కల్యాణ్‌కుమార్ అరెస్టుకు ఈడీ అధికారులు చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది.
బెట్టింగ్‌యాప్ వ్యవహారంతో కొత్త మలుపు
ఇప్పటి వరకు గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలు..గొర్రెల పంపిణీ పేరిట లబ్ధిదారులకు చేరకుండానే నిధుల మళ్లింపునకు పరిమితమైన ఈ కుంభకోణంలో ఈడీ తాజా తనిఖీలతో బెట్టింగ్‌యాప్‌ల లింక్ బయటపడింది. గొర్రెల కొనుగోలు కుంభకోణం నిధుల మళ్లింపునకు వాడిన డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్‌బుక్స్, డెబిట్ కార్డులు ఓ ఆన్‌లైన్ బెట్టింగ్‌యాప్‌తో లింక్ అయినట్టు అధికారులు గుర్తించారు. గొర్రెల కొనుగోలు డబ్బును విదేశాలకు చేర్చేందుకు లేదంటే దారి మళ్లించేందుకు ఈ బెట్టింగ్ యాప్స్‌ను వాడుకున్నారా? అన్న కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.