పోలవరం ముంపు జాబితాలోకి మరో 36 గ్రామాలు

36 more villages added to Polavaram flood list - Sakshi

కొత్తగా చేరనున్న నిర్వాసితుల సంఖ్య 13,937 

వేలేరుపాడు (ఏలూరు జిల్లా): పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు కాంటూర్‌ లెవల్స్‌తో సంబంధం లేకుండా గత ఏడాది వ­చ్చి­న గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభు­త్వం మరో 36 గ్రామాలను మొదటి దశ ముంపు జాబితాలోకి చేరుస్తోంది.

ఏలూరు, అల్లూరి సీతారామ­రా­జు జిల్లాల పరిధిలో మొత్తం 20,946 మంది నిర్వాసితులు ఉండగా.. కొత్త జాబితా ప్రకారం ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం మండలాల్లోని 36 గ్రామాలకు సంబంధించిన మరో 13,937 మంది నిర్వాసితులను చేర్చనున్నారు. దీంతో మొత్తం నిర్వాసితుల సంఖ్య 34,883కు పెరుగుతోంది. త్వరలో ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. 

కొత్తగా చేరిన గ్రామాలివీ
కొత్త జాబితాలో వేలేరుపాడు మండలంలోని పేరంట­పల్లి, తూర్పుమెట్ట, టేకూరు, కాకినూరు, కాచారం, ఎర్ర­మెట్ట, ఎడవల్లి, టేకుపల్లి గ్రామాల్లో 901 మంది నిర్వా­సితులను జాబితాలో చేరనున్నాయి. కుక్కునూరు మండలంలోని కౌడిన్యముక్తి, చీరవల్లి మాధవరం, బెస్తగూ­డెం, ఆంబోతులగూడెం, చెరువుకొమ్ముగూడెం, రావిగూడెం, ఎల్లప్పగూడెం, ఎర్రబోరు, గుడంబోరు, ముత్యాలంపాడు గ్రామాల్లో 2,123 మంది కొత్త నిర్వాసితులు చేరతారు.

చింతూరు మండలంలోని చింతూరు, రామవరంపాడు, ప్రతిపాక, గుండుగూడెం, వడ్డిగూడెం, వీఆర్‌పురం మండలంలోని వీఆర్‌పురం, ధర్మతాళ్లగూడెం, రాజ్‌పేటకా­లనీ, ఎ.వెంకన్నగూడెం, చింతరేగుపల్లి, కూనవరం మండలంలోని టేకుబాక, కూనవరం, టేకులబోరు, కొడ్రాజు­పేట, పెద్దార్కూరు, పండురాజుపల్లి, శబరికొత్తగూడెం తదితర గ్రామాలను కొత్త జాబితాలో చేరుస్తున్నారు.

కాంటూర్‌ లెవల్స్‌తో సంబంధం లేదు
కొత్త జాబితాలో చేర్చే గ్రామాలకు, పోలవరం ప్రాజెక్ట్‌ కాంటూర్‌ లెవల్స్‌కు సంబంధం లేదు. ఏటా వచ్చే వరదలకు వల్ల నిర్వాసితులు పడే ఇబ్బందులను దృష్టి­లో ఉంచుకుని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేది­కల ఆధారంగా రెండు జిల్లాల్లో 36 గ్రామాలను ముంపు జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రారంభించాం. మొదటి ప్రాధాన్యతగా ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం అందిస్తాం. – చెరుకూరి శ్రీధర్, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top