
దాచేపల్లిలో 16 లారీలు సీజ్
వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై చిందులు తొక్కిన ‘పచ్చ సైన్యం’
మంత్రి తాలూకా మనుషుల్నే అడ్డుకుంటారా! అంటూ నిలదీత
ఇలాగైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
తమకు అడ్డొస్తే లారీలతో తొక్కించుకుని వెళ్తామని బెదిరింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్: పల్నాడు జిల్లాలో గ్రానైట్ మాఫియా చెలరేగిపోతోంది. దాచేపల్లిలో గ్రానైట్ తరలిస్తున్న 16 లారీలను శనివారం తెల్లవారుజామున వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అడ్డుకోగా.. వారిపై ‘పచ్చ సైన్యం’ చిందులు తొక్కింది. తాము ఓ మంత్రికి సంబంధించిన మనుషులమని, మమ్మల్నే అడ్డుకుంటారా! అంటూ రెచ్చిపోయింది. ఇలాగైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. తమకు అడ్డొస్తే లారీలతో తొక్కించుకుని వెళ్తామని బెదిరింపులకు దిగింది.
శుక్రవారం రాత్రి నుంచి పల్నాడు జిల్లావ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రాయల్టీ చెల్లించకుండా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనాల కోసం ప్రత్యేక తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో మార్టూరు నుంచి గ్రానైట్‌తో వస్తున్న లారీలను తంగెడ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద గుర్తించి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రానైట్ మాఫియా సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అధికారులపై వాగ్వాదానికి దిగారు. తాము మంత్రి తాలూకా మనుషులమని, తమ జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
తమకు అడ్డొస్తే లారీలతో తొక్కించుకుని మరీ వెళ్లిపోతామని బెదిరించడంతో వాణిజ్య పన్నుల అధికారులు జిల్లా ఎస్పీకి ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు దాచేపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా.. మాఫియాలో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు అధికారులపై దాడికి తెగబడి తప్పించుకుని పారిపోయారు. అనంతరం గ్రానైట్ తరలింపునకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు 16 లారీలను సీజ్‌చేసి నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించారు.
మితిమీరుతున్న మాఫియా ఆగడాలు
పల్నాడు జిల్లాలో గ్రానైట్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. రాయల్టీ బిల్లులు లేకుండా అక్రమంగా గ్రానైట్ రాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. లారీలను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తే పచ్చసైన్యంతో కూడిన గ్రానైట్ మాఫియా దాడులకు తెగబడుతోంది. వీరి ఆగడాలతో ప్రభుత్వ అధికారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా పచ్చ మాఫియా రోజుకు 100కి పైగా లారీల్లో గ్రానైట్ తరలిస్తోంది. గత నెలలో అధికారులు 15 లారీలను సీజ్‌చేసి సుమారు రూ.50 లక్షల వరకు అపరాధ రుసుం వసూలు చేశారు.
సరిహద్దు దాటాలంటే.. లారీకి రూ.40 వేలు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రానైట్ అక్రమ రవాణాకు యథేచ్ఛగా సాగుతోంది. ఒక్కో లారీకి రూ.40 వేల వరకు వసూలు చేస్తూ సరిహద్దు దాటించేలా ఒప్పందాలు చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. మార్టూరు నుంచి గ్రానైట్‌తో లారీ బయలుదేరిన వెంటనే ఎస్కార్ట్‌గా కొందరు వెళుతూ రూట్ క్లియర్ చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు గుర్తిస్తే లారీలను అడ్డదారిలో అధికారుల కంటపడకుండా తరలిస్తున్నారు. అధికారులకు పట్టుబడితే బెదిరింపులకు దిగి భౌతిక దాడులకు తెగబడుతున్నారు.
గ్రానైట్ రాయి అక్రమ తరలింపు వ్యవహారంలో అధికార పార్టీ నేతల చేతివాటం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని పలువురు ప్రజాప్రతినిధులకు నెలవారీ మామూళ్లు అందుతున్నట్టు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. గ్రానైట్ మాఫియా ముఠాకు బడా నేతల అండదండలు ఉన్నట్టు చెబుతున్నారు.
ఈ మాఫియా ముఠా గ్రానైట్ లారీలను చెక్ పోస్టులు దాటించడం ద్వారా నెలకు కనీసం రూ.2 కోట్ల వరకు ఆర్జిస్తున్నట్టు తెలుస్తోంది. చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి గ్రానైట్ లారీలను వదిలేయాలనే ఆదేశాలు ఉండటంతో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.