అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు.. పరీక్షల నిర్వహణలో పారదర్శకత.. జవాబు పత్రాల మూల్యాంకనంలో నిష్పాక్షికత.. ఇవన్నీ ఆహ్వానించదగిన నిర్ణయాలే. కానీ వాటి సాధన పేరుతో ఉపాధ్యాయులపై అదనపు బాధ్యతలు మోపి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పదో తరగతి విద్యార్థుల సమ్మేటివ్ అసెస్మెంట్–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకన పర్యవేక్షణ కోసం పాఠశాల స్థాయి పరిశీలకుల నియామకానికి పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. సోమవారం నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు సజావుగా నిర్వహించాలనే ఉద్దేశం మంచిదే అయినా.. అందుకోసం అనుసరిస్తున్న విధానం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడంతోపాటు పాఠశాలల్లో బోధనపై ప్రభావం చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల టీచర్లపై నమ్మకం లేదా?
పాఠశాలల్లో పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులే నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పుడు పదో తరగతి పరీక్షల కోసం ఇతర మండలాల నుంచి స్కూల్ అసిస్టెంట్లను పరిశీలకులుగా నియమించాలని విద్యాశాఖ ఆదేశించింది. భాషా పరీక్షలకు భాషేతర ఉపాధ్యాయులు, ఇతర సబ్జెక్టుల పరీక్షలకు భాషా ఉపాధ్యాయులను పరిశీలకులుగా పంపాలని సూచించింది. ఒక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల విధులను మరో పాఠశాల ఉపాధ్యాయులు పర్యవేక్షించేలా ఆదేశాలు ఇవ్వడం తమ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
ఉదయం పరీక్ష విధులు..
మధ్యాహ్నం సొంత బడికి పరుగులు
ఉత్తర్వుల ప్రకారం పరిశీలకులు ఉదయం 8:30కు కేటాయించిన పాఠశాలకు చేరుకోవాలి. ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షలను పర్యవేక్షించాలి. అది ముగిశాక నివేదిక అందించి తమ సొంత పాఠశాలకు వెళ్లి సాధారణ విధులు కొనసాగించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణతోనే పరిశీలకుల బాధ్యతలు ముగిసిపోదు. పరీక్ష జరిగిన నాలుగో రోజు మరో పాఠశాలకు వెళ్లి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని తనిఖీ చేయాలి. కనీసం ఐదు శాతం జవాబు పత్రాలు లేదా ఐదు పత్రాలు.. ఏది ఎక్కువైతే వాటిని పరిశీలించి, మార్కుల నమోదును ధ్రువీకరించి, నివేదికలు అందజేయడంతో పాటు మార్కులను యాప్‌లో నమోదు చేసే ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
విద్యార్థుల చదువుపై ఎవరిది బాధ్యత?
ఒక ఉపాధ్యాయుడిని పరిశీలకుడిగా మరో పాఠశాలకు పంపితే ఆయన బోధించే తరగతులకు ఆ రోజు ఎవరు పాఠాలు చెబుతారు? సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోతే విద్యార్థుల చదువు ఎలా కొనసాగుతుంది? ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో కొన్ని పాఠశాలల్లో బోధన ఇబ్బందికరంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు మరిన్ని సమస్యలు సృష్టిస్తాయని ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్ణయాల కారణంగా 2027 పదో తరగతి విద్యార్థుల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు.
ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా విద్యాశాఖ నిర్ణయాలు
పరీక్షల నిర్వహణ నుంచి మార్కుల నమోదు వరకు బాధ్యతలు
విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై ప్రభావం చూపుతుందంటూ ఆందోళన
ప్రభుత్వం పునరాలోచించాలి
పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా చూడటం, జవాబు పత్రాల మూల్యాంకనంలో నాణ్యతను నిర్ధారించడం అవసరమే. అయితే ఆ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఉపాధ్యాయులపై అనవసరపు ప్రయాణ, పని భారం మోపడం తగదు. స్థానిక పరిస్థితులు, పాఠశాలల్లో ఉపాధ్యాయుల లభ్యత, మహిళా ఉపాధ్యాయుల ఇబ్బందులు, విద్యార్థుల బోధనా సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచలేమని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ బోధనకు ఆటంకం కలగని విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము.
– ఎస్టీయూ,
పీఆర్టీయూ, యూటీఎఫ్ నాయకులు


