రాయదుర్గంటౌన్: పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆయేషా(26)ను పాము కాటేయడంతో ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల మేరకు.. పెంకుటింట్లో పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న ఆయేషాను పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆదివారం రాత్రి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతురాలి భర్త కర్ణాటకలోని జగలూరులో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నారు. కాగా కుటుంబ తగాదాలతో దాదాపు ఏడాది కాలంగా ఆమె పుట్టింటిలోనే ఉంటోంది.
ప్రైవేట్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): కర్ణాటకలోని బళ్లారి పట్టణ శివారులోని అలుకుంది గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని హిర్దేహాళ్ గ్రామానికి చెందిన గంగాధర్ (39) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హిర్దేహాళ్ గ్రామం నుంచి బళ్లారి వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఆదివారం ఉదయం అలుకుంది గ్రామ శివారులో వెనుకు నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంగాధర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అత్తారింటికి టపాసులు తీసుకెళ్తూ..
● బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
గుత్తి రూరల్: దీపావళి నేపథ్యంలో అత్తారింట్లో టపాసులు ఇవ్వడానికి వెళ్తుండగా బైక్ తప్పి యువకుడు మృతి చెందిన ఘటన గుత్తి మండల పరిధి లచ్చానుపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. గుత్తికి చెందిన బోయ శివ(24) బేతాపల్లి గ్రామంలోని సోలార్ ప్లాంట్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దీపావళి పండుగ కావడంతో ఆదివారం స్నేహితులతో సరదాగా గడిపాడు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి ఎంతో సంతోషంగా గడిపాడు. అనంతరం గుంతకల్లు మండలంలోని తన భార్య ఊరైన కొంగనపల్లి గ్రామంలోని అత్త కుటుంబసభ్యులకు టపాసులు తీసుకొని పల్సర్ బైక్‌లో బయలుదేరాడు. లచ్చానుపల్లి గ్రామ శివారులోకి రాగానే వేగంగా వెళ్తున్న పల్సర్ బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ రోడ్డు పక్కన కంపచెట్లలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన శివ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రమాదాన్ని రాత్రి ఎవరూ గమనించకపోవడంతో రాత్రంతా కంప చెట్లలోనే పడి ఉన్నాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు యువకుడిని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, బైక్ నంబర్ ఆధారంగా మృతుడి ఆచూకీని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య వెంకటేశ్వరమ్మ, ఆరు నెలల కుమార్తె కీర్తన ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


