కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున టీ సర్కిల్లో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. అటుగా వెళ్తున్న వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. శనివారం ఎర్రనేల వీధిలో మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో వివాహిత పార్వతి స్వల్పంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఎలుగుబంట్ల సంచారంతో పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి
బెళుగుప్ప: మండల పరిధిలోని నారింజ గుండ్లపల్లి గ్రామానికి చెందిన తిప్పేస్వామి(60) ఆదివారం రాత్రి ఇంటి అవసరాల నిమిత్తం నీటిని పట్టేందుకు మోటారును పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు తిప్పేస్వామి ఆదివారం ఇంటి కోసం మోటారు పెట్టి స్విచ్ బోర్డుకు వైరు పెడుతుండగా షాక్ కొట్టింది. దీంతో బాధితుడు ఒక్కసారి కుప్పకూలిపోయాడు. విద్యుత్ షాక్‌తో ఇంటి యజమాని మృతి చెందడంతో కుటంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై విద్యుత్ అధికారులకు సమాచారమందించారు. కాగా మృతుడికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
శతాధిక వృద్ధుడు మృతి
గుంతకల్లుటౌన్: సమాజ సేవకులు, మాజీ కౌన్సిలర్ వంకదారు రామకృష్ణయ్య(104) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గుంతకల్లు మున్సిపాలిటీ ఏర్పడిన 1948 సంవత్సరంలో ఆయన మొట్టమొదటి కౌన్సిలర్‌గా సేవలందించారు. అంతేకాకుండా తిలక్‌నగర్‌లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ(హిందీ పండిట్ కాలేజీ)ను స్థాపించి ఎంతో మంది పండితులను తీర్చిదిద్దారు. దేవాలయాలు, బడుల నిర్మాణానికి తన వంతు సహకారమందించి సమాజ సేవకుడిగా కీర్తిప్రతిష్టలు పొందారు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. విషయం తెలుసుకున్న పురప్రముఖులు మండీబజార్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.
ఆర్డీటీ హాస్టల్‌లో నర్సు ఆత్మహత్య
కళ్యాణదుర్గం రూరల్: ఆర్డీటీలో నర్సుగా పని చేస్తున్న భార్గవి(22) ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఆర్డీటీ ఆసుపత్రి హాస్టల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుందుర్పి మండలం తెనగల్లుకు చెందిన నరసింహులు, నాగరత్నమ్మ దంపతుల కుమార్తె భార్గవి గత రెండేళ్లుగా కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తూ అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. ఆదివారం యువతి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడగా, గమనించినహాస్టల్ సిబ్బంది పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం భార్గవి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి యాజమాన్యం పని ఒత్తిడి తాళలేక తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడినట్టు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పట్టణ పోలీసులు దర్యాపు చేస్తున్నారు. కాగా సంఘటన స్థలంలో దొరికిన ఆధారాల మేరకు ఆత్మహత్యకు గల కారణాలు మరేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): మద్యం తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్న ఘటన డి.హీరేహాళ్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన గొర్ల ఆంజినేయ (56) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీతో పాటు ముగ్గురు కుమారులున్నారు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన ఆంజినేయను కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించినా తీరు మారలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు. అక్కడ మద్యం సేవించొద్దని భార్య మరోసారి మందలించడంతో పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని బళ్లారి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


