కేశవ్‌ అబద్ధాలాడటం సిగ్గుచేటు | - | Sakshi
Sakshi News home page

కేశవ్‌ అబద్ధాలాడటం సిగ్గుచేటు

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్‌ స్థానిక సంస్థల ఎన్నికల విజయంపై చేసిన వ్యాఖ్యలు ‘అబద్ధాలు పీక్‌.. పెర్ఫార్మెన్స్‌ వీక్‌’ అని వైఎస్సార్‌సీపీ గ్రేటర్‌ రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి కె.వి.రమణ ధ్వజమెత్తారు. సోమవారం ఉరవకొండలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. కూడేరులో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను స్టేషన్‌లో బంధించారని, దీనిపై మంత్రి స్పందిస్తూ ‘వైఎస్సార్‌సీపీ నాయకులే ఎన్నికలు వద్దు’అని చెప్పారని అనడం సిగ్గుచేటన్నారు. అదే వాస్తవమైతే స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాదులు, మీడియాను స్టేషన్‌లోకి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని బహిర్గతం చేసి విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. కూడేరు జెడ్పీటీసీ అభ్యర్థి కురుబ రామచంద్ర నామినేషన్‌ వేయనీకుండా సీఐ రాజు గుంతకల్లులో ఉంచితే, మాజీ ఎమ్మెల్యే విశ్వ ఎస్పీకి ఫిర్యాదు చేస్తే వదిలిపెట్టింది నిజం కాదా అని నిలదీశారు. ఉరవకొండ, కూడేరు మండలాల్లో మంత్రి కేశవ్‌, ఆయన అనుచరులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. కేశవ్‌ స్వంత గ్రామంలో దళిత మహిళ నామినేషన్‌ వేయకుండా పోలీసులతో కిడ్నాప్‌ చేయించిన తీరును అందరూ గమనించారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే మంత్రి కేశవ్‌ వ్యవస్థలను వాడుకుని ఎన్నికలు చేశారని ఆరోపించారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించి మీడియా ముందు ఆయన అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను మోసగించాలని చూస్తున్నారని, అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

కూడేరు ఘటనపై విచారణ చేయాలి

వైఎస్సార్‌సీపీ నాయకుడు కేవీ రమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement