గార్లదిన్నె: హెచ్చెల్సీ కాలువలో దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని క్రిష్ణాపురంలో చోటు చేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు గార్లదిన్నె మండలం క్రిష్ణాపురానికి చెందిన ఆదిలక్ష్మి(51) గార్లదిన్నె చెందిన ఆంజనేయులతో గతంలో వివాహమైంది. పెళ్లయిన కొద్దిరోజులకే భార్య, భర్తల మధ్య విబేధాలు రావడంతో ఆమె క్రిష్ణాపురంలోని తన అన్నదమ్ముళ్ల వద్ద ఉంటోంది. ఇటీవల పెద్దన్న వెంకటేశులు అనారోగ్యంతో మృతి చెందడంతో.. ఇంకా తనను ఎవరు పట్టించుకుంటారని నిత్యం మదనపడేది. దీంతో ఈ నెల 7న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె గురించి కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. 8వ తేదీ ఉదయం మర్తాడు క్రాస్ సమీపంలో హెచ్చెల్సీ కాలువలో మహిళ మృతదేహం ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని కాలువలో ఉన్న మహిళ మృతదేహాన్ని బయటకు తీసి, క్రిష్ణాపురానికి చెందిన మహిళగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. కాగా మృతురాలికి సంతానం లేరు.


