వెన్నపూసపల్లిలో..
అనంతపురం : ఎల్లనూరు మండలంలో జేసీ అనుచరుల ఆగడాలు శ్రుతిమించి పోతున్నాయి. స్థానిక ఎన్నికల వేళ మండలంలోని గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా జేసీ గూండాలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఆదివారం ఎల్లనూరు మండలం వెన్నపూసపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్రామంలో ఉన్న టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసేలా దాడులకు తెగబడ్డారు. అలానే భోగాతి నారాయణరెడ్డి వర్గీయులకు చెందిన కార్లను ధ్వంసం చేశారు. ఆదివారం గ్రామంలో టీడీపీ అభ్యర్థులు ప్రచారం చేశారు. ప్రచారం పూర్తయ్యాక కూడా డ్రమ్స్‌తో ఊరేగింపు చేస్తుండగా అదే సమయంలో వైఎస్సార్సీపీ నాయకుడు రామేశ్వరరెడ్డి పాల కోసం వెళ్తుంటే ఎదురుగా వస్తున్న టీడీపీ నాయకుడు గంగా రాజేష్‌రెడ్డి, అనుచరులతో కలిసి కర్రలతో దాడికి దిగారు. దాడిని అడ్డుకోబోయిన భార్య రమాదేవి పైనా దాడి చేయడమే కాక సర్దిచెబుతున్న కూతురు దుస్తులు చించేసినట్టు తెలుస్తోంది. అదే విధంగా అల్లుడు సుధాకర్‌రెడ్డికి చెందిన కారును కూడా టీడీపీ మూకలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మల్లాగుండ్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కొండారెడ్డి తన అనుచరులతో కలిసి వెన్నపూసపల్లికి వస్తుండగా మార్గ మధ్యంలో బొలెరో వాహనాన్ని టీడీపీ గూండాలు అడ్డుకొని ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసి, బొలెరో వాహనానికి నిప్పుపెట్టారు. అదే విధంగా పుత్తా దీప, సుధాకర్‌రెడ్డిలకు చెందిన కార్లను ధ్వంసం చేశారు. అలాగే రెండు ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసం చేశారు. తాము వైఎస్సార్సీపీ మద్దతుదారులు కావడంతో తమ కార్లు, బైక్‌లను ధ్వంసం చేశారని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. టీడీపీ గూండాల దాడులకు మరింత ఆజ్యం పోసేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి 16 కార్లలో అనుచరులతో గ్రామానికి వెళ్తుండగా యల్లనూరు పోలీసుస్టేషన్ వద్ద పుట్లూరు సీఐ వంశీకృష్ణ, యల్లనూరు ఎస్ఐ రామాంజినేయరెడ్డిలు ఆయన్ను అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను తాడిపత్రికి పంపించేశారు.
ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, (ఇన్సెట్లో) వివరాలు వెల్లడిస్తున్న బాలా రమేష్ బాబు
వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి, అడ్డుకోబోయిన భార్యనూ వదలని వైనం
సర్ది చెప్పేందుకు వచ్చిన కూతురి దుస్తులు చించేసిన జేసీ గూండాలు
కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం
ఇళ్లపై దాడి చేసిన టీడీపీ మూకలు
గాంధీజీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన
యాడికి: స్థానిక ఎన్నికల వేళ మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు, అభ్యర్థులపై, వారి ఇళ్లపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారు. మండల కేంద్రంలో ఏడు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్‌గా అధికార పార్టీ మూకలు దాడులు చేశాయి. ఆదివారం యాడికి–4 ఎంపీటీసీ అభ్యర్థి అలివేలమ్మ ఇంటిలోని ఫర్నీచర్, సామగ్రిని టీడీపీ గూండాలు ధ్వంసం చేయడమే కాక యాడికి–5 ఎంపీటీసీ అభ్యర్థిని రజియాకు చెందిన వాహనాన్ని రాళ్లతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బాలా రమేష్‌బాబు, నాయకులు మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ ఈ ఘటనపై వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అల్లర్లు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.
బాలా రమేష్ ఇంటిపై రాళ్ల దాడికి యత్నం
యాడికి మండల కేంద్రంలోని బాలా రమేష్ బాబు ఇంటిపై ఆదివారం సాయంత్రం రాళ్లతో దాడి చేసేందుకు వస్తున్న టీడీపీ వర్గీయులను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ వర్గీయులపై వైఎస్సార్సీపీ నాయకులు ఎదురు దాడి చేశారు. దీంతో పచ్చ రౌడీలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో మండల కేంద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


