పెళ్లి బస్సు టైర్లు బరస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సు టైర్లు బరస్ట్‌

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

బొమ్మనహాళ్‌: కర్ణాటక రాష్ట్రంలోని బసవ కళ్యాణ డిపోకు చెందిన పెళ్లి బస్సు టైర్లు బరస్ట్‌ అవ్వడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన బొమ్మనహాళ్‌ మండలంలోని ఎల్‌బీ నగర్‌ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు మధుగిరి ప్రాంతానికి చెందిన దాదాపు 35 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు బొమ్మనహాళ్‌ మండలంలోని ఎల్‌బీ నగర్‌ సమీపంలోకి రాగానే వెనుక ఒక వైపు ఉన్న రెండు టైర్లు పేలడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పడంతో డ్రైవర్‌ అప్రమత్తమై పక్కన నిలిపివేశాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎవరికి గాయాలవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పెళ్లికి వెళ్తూ పరలోకాలకు..

● అదుపు తప్పిన ద్విచక్ర వాహనం..

యువకుడు మృతి

కళ్యాణదుర్గం రూరల్‌: బంధువుల పెళ్లికి వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి సాయి(20)అనే యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం గరుడాపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన యువరాజు, సన్నీరమ్మ దంపతుల కుమారుడు సాయి బేల్దారి పనులు చేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. ఆదివారం కర్ణాటక రాష్ట్రం పావగడలో బంధువుల పెళ్లికి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామం వద్ద బండి వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో బైక్‌ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయిని వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

అనుమానాస్పద స్థితిలో

వృద్ధురాలు మృతి

కూడేరు: మండల పరిధిలోని కలగళ్ల గ్రామంలో ఏకిల ఓబుళమ్మ(85) అనే వృద్ధురాలు ఆదివారం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధురాలి మృతిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతురాలికి నలుగురు కుమార్తెలున్నారు.

మనస్థాపమా..

మరేదైనా కారణ మా?

● మద్యం మానేయాలని

మందలించడంతో వ్యక్తి ఆత్మహత్య

● మృతుడి కాళ్లు నేలపై ఉండడం..

కర్రకు ఉరివేసుకోవడంపై అనుమానాలు

● విచారణలో తేలనున్న నిజాలు

బత్తలపల్లి: మద్యం మానేయాలని సహచారిని చెప్పడంతో మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కట్టకిందపల్లి గ్రామ శివారు గంగాదేవి చెరువు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. మహరాష్ట్రలోని పూణే జిల్లా లోనావాలా మండలం కునేనామా గ్రామానికి చెందిన నిక్లాస్‌ విజయ్‌ వాఘ్మోరే(48) తన భార్య మరణించడంతో మంగళ్‌ నిక్లాస్‌ వాఘ్మోరేతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. వీరు ఉపాధి నిమిత్తం గతేడాది నవంబర్‌లో బత్తలపల్లి మండలం కట్టకిందపల్లికి వలస వచ్చారు. బొగ్గుల తయారీ పనులు చేస్తూ, కట్టకిందపల్లి చెరువు వద్ద తాత్కాలిక గుడారాలు వేసుకొని అక్కడే ఉంటున్నారు. అయితే విజయ్‌ మద్యానికి బానిసవ్వడంతో మంగళ్‌ ఆ అలవాటు మానేయాలని పలుమార్లు మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అక్టోబర్‌ 31న (శనివారం రాత్రి) పక్కన ఉన్న తాత్కాలిక గుడారానికి విజయ్‌ వెళ్లాడు. ఆదివారం ఉదయం మంగళ్‌ లేచి గుడారంలోకి వెళ్లి చూసేసరికి కర్రకు తాడుతో ఉరివేసుకొని ఉండటాన్ని గమినించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న వెంటనే బత్తలపల్లి ఏఎస్‌ఐ రాము తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తొలి భార్యకు ఇద్దరు కుమారులు, మంగళ్‌కు కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా మృతుడి కాళ్లు నేలకు ఆనుకొని ఉండడం కర్రకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు లోతైన విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని గ్రామస్తులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement