ఉరవకొండ: స్థానిక శాంతినగర్‌కు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సతీష్ రాఘవేంద్రపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు సతీష్ తెలిపిన వివరాల మేరకు.. రాయంపల్లి రోడ్డు వద్దనున్న బసవరాజు సీఫాం నుండి ఇంటికెళ్తున్న సతీష్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ శంకర్లను ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. ఇందులో ఒకరు శంకర్‌ను పట్టుకోగా మిగిలిన వారు సతీష్‌పై దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సతీష్‌ను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు బసవరాజు, పట్టణ అధ్యక్షులు ఈడిగ ప్రసాద్‌లు సతీష్‌ను పరామర్శించేందుకు ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం వారు బాధితుడు సతీష్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శీనప్ప డైరెక్షన్లోనే టీడీపీ గూండాలు దాడి తెగబడినట్టు ఆరోపించారు. దాడి సమయంలో ‘నువ్వు శీనప్ప అన్ననే అంటావా.. అంతా మగాడివా అంటూ’కర్రలతో దాడి చేసినట్టు తెలిపారు. టీడీపీ నాయకులు ఉరవకొండ–2, 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నించగా, అక్కడ పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను సతీష్ కాపాడినందుకే టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక దాడులకు ఒడిగట్టారని మండిపడ్డారు. దాడి కారకులను పోలీసులు పట్టుకొని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ గూండాల దాడులకు భయపడేది లేదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు.
తీవ్ర గాయాలతో ఆస్పత్రి చేరిన
సతీష్ రాఘవేంద్ర
బాధితుడిని పరామర్శించిన
వైఎస్సార్సీపీ నాయకులు
మంత్రి, ఆయన సోదరుడి ఆదేశాల మేరకే దాడి చేశారంటూ ఆరోపణ


