ఇదేంది ‘బాసూ’ ఇట్లజేత్తివి!
● ఎన్నికల నిర్వహణలో అట్టర్‌ఫ్లాప్
● కూటమి అరాచకాలను నిలువరించలేని స్థితిలో పోలీసులు
● అనంతపురం చరిత్రలో తొలిసారి రిగ్గింగ్‌ను పరిచయం చేసిన వైనం
అనంతపురం సెంట్రల్: ‘మున్సిపల్ ఎన్నికలకు భారీ బందోబస్తు.. కట్టుదిట్టమైన భద్రత.. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్.. లోకల్ పోలీసులతో పాటు ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్టీఎఫ్ బలగాల మోహరింపు.. వజ్ర, మైన్‌ప్రూఫ్, వాటర్ కేనన్ల లాంటి అధునాతనమైన వాహనాలు, దాదాపు 2,500 మందితో పటిష్ట బందోబస్తు’ అంటూ జిల్లా పోలీసు బాస్ చేసిన ప్రకటనలు కూటమి నాయకుల దౌర్జన్యకాండ ముందర పటాపంచల్ అయ్యాయి. జిల్లాలో ఎప్పుడూ కొనసాగే తాడిపత్రి లాంటి ప్రదేశంలోనే కాదు అనంతపురంలో కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా ఉంటుందో పరిచయం చేశారు. కూటమి నాయకులు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నాలు చేయలేదు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా పోలీసు యంత్రాంగం వారం రోజులపాటు కసరత్తు చేసింది. కానీ పోలింగ్ రోజున వారి వ్యూహాలేవీ పనిచేయలేదు. ఆదివారం పోలింగ్ సందర్భంగా కూటమి నాయకులు అనుకున్న వ్యూహాలను అమలు పరిచారు. ఇందుకు పోలీసులు పరోక్షంగా మద్దతు ఇచ్చారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
● తాడిపత్రిలో ప్రతిపక్షపార్టీ నాయకులకు, కార్యకర్తలకు పోలీసులు రక్షణ లేకుండా చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ దాదాపు 40 మంది వైఎస్సార్‌సీపీ ముఖ్య కార్యకర్తలపై దాడులు చేశారు. టీడీపీ నేతలు దాదాపు 200 మంది గూండాలతో గ్యాంగ్‌నే ఏర్పాటు చేసి దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
● విద్యావంతులు, మేధావులు, ప్రభుత్వ ఉద్యోగులు, సంపన్నులకు నిలయమైన అనంతపురం నగరం ప్రశాంతతకు మారుపేరుగా ఇప్పటి వరకూ ఉండేది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చిన్న,చిన్న వాగ్వాదాలతో ముగిసిపోయేవి. కానీ ఈసారి పూర్తి భిన్నంగా ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌లో ఉన్న రౌడీ కోణం పూర్తిగా బయటపడింది. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి అక్కడి వైఎస్సార్‌సీపీ నాయకులను, ఏజెంట్లను రెచ్చగొట్టడం, దాడులకు పాల్పడడం, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం లాంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యేనే పాల్పడడాన్ని నగరవాసులు చీదరించుకుంటున్నారు. 30వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి అశోక్‌రెడ్డి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పోలీసులు కన్నెత్తి చూడలేదు.
చర్యలు తీసుకుంటారా?
ప్రశాంత ఎన్నికలకు విఘాతం కలిగించే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తాం.. పీడీ యాక్టు ప్రయోగిస్తామంటూ పోలీసు అధికారులు ప్రకటించారు. మరి ఆదివారం జిల్లా వ్యాప్తంగా అరాచకం సాగించిన కూటమి నాయకులపై ఎలాటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
అనంతపురం: ఓటమి భయం వెన్నులో వణుకు పుట్టిస్తుండడంతో అధికార కూటమి పార్టీలు అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో అరాచకానికి తెరలేపాయి. పోలింగ్ కేంద్రాలను టీడీపీ, బీజేపీ గూండాలు రాజకీయ క్రీడా మైదానాలుగా, అక్రమాల అడ్డాగా మార్చేశారు. పలు డివిజన్లలో బరితెగించి మరీ సాగించిన రిగ్గింగ్.. సైక్లింగ్ (దొంగ ఓట్ల) పర్వం తీవ్ర కలకలం రేపింది. కూటమి శ్రేణుల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది.
● 30వ డివిజన్‌లోని 30/3 పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగింది. హమాలీ కాలనీలోని బీఆర్ అంబేడ్కర్ నగర పాలక యూపీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద మధ్యాహ్నం బీజేపీ అభ్యర్థికి చెందిన వ్యక్తులు ఓటర్లను, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, నాయకులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే క్రమంలో కడపకు చెందిన చిన్నా అనే వ్యక్తి, బీజేపీ అభ్యర్థి అశోక్‌రెడ్డికి పోలింగ్ ఏజెంట్ ఉన్న ఆదిశేషు పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళ్లి.. సిబ్బందిని, ఏజెంట్లను బయటకు పంపి.. తలుపులు మూసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అనంతరం రిగ్గింగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థి వెన్నం శివారెడ్డి నిరసనకు దిగగా.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కూటమి నేతల అక్రమాలు, దాడులు, పోలీసుల ఏకపక్ష వైఖరిపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. రీ పోలింగ్ నిర్వహించాలని కోరారు. దీంతో సోమవారం రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.
● 31వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మినేని శివ యల్లనూరు మండలం నుంచి భారీగా మహిళలను రప్పించి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు కార్పొరేటర్ అభ్యర్థి నాగార్జునరెడ్డి గుర్తించి అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్‌బాబు అక్కడకు చేరుకుని ఘర్షణలకు ఆజ్యం పోశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మేయర్ అభ్యర్థి రమేష్‌గౌడ్, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు అక్కడకు చేరుకోగా.. పోలీసులు అత్యుత్సాహంతో వారిని అక్కడి నుంచి తోసేసి.. రిగ్గింగ్‌కు అవకాశం కల్పించారు. ఇదే డివిజన్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన అనుచరులను లోపలికి పంపించి రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే వెనుదిరగాల్సి వచ్చింది.
ఏజెంట్, అభ్యర్థులు, నాయకులపై దాడులు
నగరంలోని 40వ డివిజన్ గుడ్ చిల్డ్రన్స్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలకు చెందిన వారిని రప్పించి రిగ్గింగ్‌కు యత్నించడంతో పాటు వైఎస్సార్‌సీపీ ఏజెంట్ లోకనాథ్‌పై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అక్కడికి చేరుకుని పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి చేతికి గాయమైంది. అలాగే 45వ డివిజన్ జ్ఞాన సరస్వతి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణుల దౌర్జన్యాన్ని అడ్డుకోబోయిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి అనిల్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు విశ్వనాథరెడ్డి, తండ్రి రామాంజనేయులరెడ్డిపై మద్యం మత్తులో ఉన్న టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా దాడి చేశారు.
బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లే యత్నం
కోర్టు రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్‌లోని పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లేందుకు టీడీపీ అల్లరి మూకలు ప్రయత్నించాయి. ఇంతలో స్పెషల్ పార్టీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 1, 23, 30, 61 డివిజన్లలోనూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి.. రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.
స్థానికేతరులతో సైక్లింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతలు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని రప్పించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 48వ డివిజన్‌లో టీడీపీ శ్రేణులు దొంగ ఓట్లు వేస్తుండటాన్ని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి చింతకుంట మధు గమనించి అడ్డుకున్నారు. చనిపోయిన వారి పేర్లతో కొందరు టీడీపీ కార్యకర్తలు ఓటరు స్లిప్పులు తీసుకొచ్చి ఓట్లు వేసేందుకు ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ‘మా ప్రభుత్వంలో మేము దొంగ ఓట్లు వేయించుకోకూడదా?’ అంటూ దాడికి దిగారు. చింతకుంట మధుతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చాకలి హరి, సురేష్ గాయపడ్డారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి చేపల హరి, చేపల ఆనంద్, గుణశేఖర్, మహేష్‌తో పాటు రుద్రంపేటకు చెందిన అనిల్, కోవూర్‌నగర్‌కు చెందిన ఫారూక్ తదితరులు దాడికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. ఇదే డివిజన్‌లో మూడు పోలింగ్ బూత్‌ల్లోకి ఎమ్మెల్యే దగ్గుపాటి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా చొరబడి అధికారుల ఎదుటే బ్యాలెట్ పత్రాలు తీసుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
దొంగ ఓట్లను ‘దండు’కున్నారు..
41వ డివిజన్‌లో టీడీపీకి చెందిన ‘చంద్ర దండు’ ప్రకాష్‌నాయుడు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేట, పిల్లిగుండ్లకాలనీతో పాటు ఆత్మకూరు మండలం నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను రప్పించి ఓట్లు సైక్లింగ్ చేయించారు. ఈ అక్రమాలను వైఎస్సార్‌సీపీ, స్వతంత్ర అభ్యర్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిపై ప్రకాష్‌నాయుడు దాడికి యత్నించాడు.
గంగారాం.. వీరంగం..
40వ డివిజన్‌లో టీడీపీ నేత గంగారాం వీరంగం సృష్టించాడు. ఓటరు స్లిప్పులు లేకున్నా, జాబితాలో పేర్లు లేకున్నా టీడీపీ కార్యకర్తలు లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేశారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్ గవ్వల లోకనాథ్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు దాడి చేశారు. విషయం తెలుసుకుని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అనంత, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ అక్కడికి చేరుకుని క్యూలో ఉన్న దొంగ ఓటర్లను నిలదీశారు. ఈ సమయంలో గంగారాం వర్గీయులు వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
అరాచకం రాజ్యమేలింది. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. కూటమి దాష్టీకాలు పతాకస్థాయికి చేరాయి. ఎన్నికలు
అపహాస్యమయ్యాయి. హామీలు నెరవేర్చి..
ప్రజల హృదయాలు గెలుచుకోవడం చేతగాని పాలకులు కుటిల నీతితో వ్యవహరించారు. ఎన్నికల
యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు, ఓట్ల రిగ్గింగ్‌ను ప్రోత్సహించారు. మున్సి‘పోల్స్’లో ఓటర్ల
తీర్పునకు విలువ లేకుండా చేశారు.
ఆదివారం జరిగిన మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం నగర పాలక సంస్థతో పాటు తాడిపత్రి, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల్లో అధికార పార్టీ దాష్టీకాలు చూసి
ప్రజలు భీతిల్లిపోయారు.
మున్సిపల్ ఎన్నికల్లో
62.45 శాతం పోలింగ్
అనంతపురం: జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీలకు ఆదివారం పోలింగ్ జరిగింది. జిల్లా సగటు పోలింగ్ 62.45 శాతం నమోదైంది.


