సాక్షి, అనంతపురం జిల్లా: రాప్తాడులో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉన్మాది డుంబు అలియాస్ హేమంత్‌పై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ నిందితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. అయితే, హేమంత్‌కు కాళ్లు తొలగించే యోచనలో వైద్యులు ఉన్నట్లు సమాచారం. హేమంత్‌కు రెండు కాళ్లలో మూడు బుల్లెట్లు ఇరుక్కున్నాయి. కాళ్ల తొలగింపునకు సర్జరీ చేయనున్నట్లు తెలిసింది.
కాగా, నిందితుడిని పట్టుకునేందుకు 25 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు ఆత్మకూరు సమీపంలోని అడవుల్లో ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ నిందితుడిని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులపై అతడు ఒక్కసారిగా కత్తితో దాడికి యత్నించాడు. దీంతో రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లు చేతికి గాయాలయ్యాయి. అయితే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో నిందితుడి మోకాళ్లలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని పట్టుకుని అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు.
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం పదో తరగతి విద్యార్థిని గోపిక తరగతి గదిలో చదువుకుంటుండగా చెట్లు కోసే ఎలక్ట్రిక్ రంపంతో హేమంత్ విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మీపైనా దాడికి తెగబడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన గోపికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, మరో విద్యార్థిని లక్ష్మీ అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఇదీ చదవండి: రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు


