బొమ్మనహాళ్: జిల్లాలో ప్రసిద్ది చెందిన దర్గాహొన్నూరు స్వామి ఉత్సవాల్లో భాగంగా దర్గాహొన్నూరు సర్మస్ హుస్సేనీ స్వామి షంషీర్ను ఘనంగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున షంషీర్ను గ్రామవీధుల్లో భారీ జన సందోహం మధ్య మేళతాళాలు, తాశా డ్రమ్ములు, తప్పెట్లతో భారీ ఊరేగింపుతో దర్గా వద్దకు చేర్చారు. షంషీర్ గుర్రాన్ని ప్రత్యేకంగా అలంకరించి దర్గా వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో రంగురంగుల విద్యుద్దీపాలతో స్వామి ఊరేగింపు కొనసాగింది. కర్ణాటక, ఆంధ్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈసందర్భంగా భక్తులు స్వామి వారి దివ్వెలకు ఒట్టి కొబ్బెర సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో 8వ పీఠాధిపతులు సయ్యద్ రహంతుల్లా హుస్సేనీ, సయ్యద్ ఖాజా ఫీరా హుస్సేనీ, సయ్యత్ ఇనాయత్ బాబా, దర్గా పెద్దలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.
హోరాహోరీగా ఇరుసు ఎత్తే పోటీలు
బొమ్మనహాళ్: దర్గాహొన్నూరు గ్రామంలో సర్మస్ హుస్సేనీ ఉరుసు సందర్భంగా ఇరుసు ఎత్తే పోటీలు హోరాహోరీగా శనివారం జరిగాయి. పోటీల్లో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నారాయణ మొదటి బహుమతి రూ.10 వేలు, అరవకూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు రెండో బహుమతి రూ. 5 వేలు, కమ్మూరు గ్రామానికి చెందిన ఎర్రిస్వామి మూడో బహుమతి రూ.3 వేలు గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు, మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, యువజన అధ్యక్షుడు బడిగే వన్నూరుస్వామి, నాయకులు నాగేంద్ర, కాపు సిద్దేష్, ప్రసాద్, వన్నూరుస్వామి, బండూరు గణేష్, బంగి వన్నూరుస్వామి, కల్వకుర్తి రామాంజనేయులు, యల్లప్ప, వండ్రప్ప, బేనేకల్లు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


