అనంతపురం: నంద్యాల జిల్లా ఆత్మకూరు రూరల్ ‘సాక్షి’ రిపోర్టర్ సుబ్బారెడ్డిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు చేసిన దాడిని ఏపీడబ్ల్యూజేయూ, ఏపీడబ్ల్యూజేఎఫ్, రాష్ట్ర చిన్నపత్రికల సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలకు వినతిపత్రం సమర్పించారు. ఏపీడబ్ల్యూజేయూ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏ. షఫీవుల్లా, చిన్నపత్రికల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి అనిల్ కుమార్‌రెడ్డి హాజరై.. పాత్రికేయుల రక్షణకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న విషయాలను, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే విలేకరులపై భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టన్నారు. అధికార బలం, రాజకీయ అండచూసుకుని రిపోర్టర్ సుబ్బారెడ్డిపై దాడికి దిగడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు భద్రత లేకపోతే పత్రికా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర చిన్నపత్రికల సంఘం ఉపాధ్యక్షుడు కొత్తపల్లి అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విలేకరి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యాలకు దిగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తగదన్నారు. వెంటనే పాత్రికేయులకు రక్షణ కల్పించే ప్రత్యేక చట్టాన్ని అమలుల్లోకి తీసుకురావాలన్నారు. దాడి ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులను ఏకం చేసి ఉద్యమిస్తామన్నారు. షఫీవుల్లా మాట్లాడుతూ బెదిరింపులు, దాడులతో విలేకరుల నోళ్లు నొక్కలేరని, సుబ్బారెడ్డిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.


