ఓట్ల విభజనలోనూ రాజకీయం?
● విభజన వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు అంటూ ఆరోపణలు
● రాచానపల్లిలో ఒక ఎంపీటీసీకి 1,620.. మరో స్థానానికి 4,061 ఓట్లు
● కక్కలపల్లి ఎంపీటీసీ స్థానంలో అత్యధికంగా 5,011 ఓట్లు
● 36 ఎంపీటీసీ స్థానాల్లో 1.28 లక్షల మంది ఓటర్లు..137 పోలింగ్ కేంద్రాలు
● ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం...తక్కిన 29 స్థానాలకు నవంబరు 5న పోలింగ్
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల సంఖ్యలో కనిపిస్తున్న వ్యత్యాసాలు చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల విభజన ఏ ప్రాతిపదికన చేపట్టారు? ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది? అన్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. రూరల్ మండలంలో ఒక ఎంపీటీసీ స్థానంలో వెయ్యికి పైగా ఓటర్లు ఉంటే.. మరికొన్ని స్థానాల్లో 5 వేల మంది దాకా ఓటర్లు ఉన్నారు. రాచానపల్లి పంచాయతీలోని రెండు ఎంపీటీసీ స్థానాల మధ్య ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విభజన వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.
అనంతపురం రూరల్ మండలంలోని 36 ఎంపీటీసీ స్థానాల పరిధిలో మొత్తం 1,28,125 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో రాచానపల్లి–1 ఎంపీటీసీ స్థానంలో అత్యల్పంగా 1,620 మంది ఓటర్లు ఉన్నారు. మరోవైపు కక్కలపల్లి ఎంపీటీసీ స్థానంలో అత్యధికంగా 5,011 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల సంఖ్యలో ఈ భారీ వ్యత్యాసం స్థానాల విభజనపై ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
రాచానపల్లిలోనే అసలు చర్చ..
రాచానపల్లి పంచాయతీలో రెండు ఎంపీటీసీ స్థానాల మధ్య ఓటర్ల సంఖ్యలో కనిపిస్తున్న తేడా మరింత చర్చనీయాంశమైంది. రాచానపల్లి–1 ఎంపీటీసీ స్థానంలో 1,620 మంది ఓటర్లు ఉండగా, రాచానపల్లి–2 ఎంపీటీసీ స్థానం పరిధిలో 4,061 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు స్థానాల మధ్య ఏకంగా 2,441 ఓట్ల వ్యత్యాసం ఉంది. అయితే ఈసారి ఒక స్థానంలో 4,000 మందికి పైగా ఓటర్లు ఉండగా, మరో స్థానంలో 1,620 మందికే పరిమితం కావడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మార్పులకు కారణాలేమిటో అధికారులకే తెలియాలి. ఓటర్ల విభజన ఏ ప్రాతిపదికన చేపట్టారు? గతంలో ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఈసారి ఇంతటి వ్యత్యాసం ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.
అర్బన్ పరిధిలో 11.. రాప్తాడులో 25
అనంతపురం రూరల్ మండలంలోని 36 ఎంపీటీసీ స్థానాల్లో 11 అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండగా, మరో 25 రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మండల వ్యాప్తంగా 65,043 మంది మహిళలు, 63,071 మంది పురుషులు, 11 మంది ఇతర ఓటర్లు కలిపి మొత్తం 1,28,125 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు పురుషుల కంటే 1,972 మంది అధికంగా ఉన్నారు. 36 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏడు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. తక్కిన 29 స్థానాలకు నవంబరు 5న పోలింగ్ జరగనుంది. 7న ఫలితాలు విడుదలకానున్నాయి.


